ప్రజాస్వామ్య మూలస్తంభాలను ఆక్ర‌మంచిన పెగాస‌స్‌

ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెగాస‌స్ స్పైవేర్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు విఘాతం క‌లిగించ‌డంపై తీవ్ర ఆందోళ‌న నెల‌కుంది. దేశంలోని అత్యంత ప్ర‌ముఖుల ఫోన్లు హ్యాక్‌కు గురి కావ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ…

ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెగాస‌స్ స్పైవేర్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు విఘాతం క‌లిగించ‌డంపై తీవ్ర ఆందోళ‌న నెల‌కుంది. దేశంలోని అత్యంత ప్ర‌ముఖుల ఫోన్లు హ్యాక్‌కు గురి కావ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేప‌థ్యంలో మోదీ స‌ర్కార్‌పై ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అమ‌ర‌వీరుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఆన్‌లైన్‌లో బుధ‌వారం ప్ర‌జ‌ల‌నుద్దేశించి ఆమె ప్ర‌సంగించారు.

విపక్ష నేతల ఫోన్లను కేంద్రం హ్యాక్‌ చేస్తోందని, సమాఖ్య నిర్మాణాన్ని బీజేపీ కూలదోసిందని మండిప‌డ్డారు. “మిస్టర్ మోదీ…నేను మీపై వ్యక్తిగతంగా దాడి చేయటం లేదు. కానీ మీరు, హోంమంత్రి, ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారు, చివరికి వారి మంత్రులనే నమ్మలేదు”  అంటూ మోదీపై  విరుచుకు పడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ప్రతిక్షాలకు పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ అతి ప్రమాదకరం, భయంకరమైందని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దేశంలో స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక మీద‌ట‌ తాను ఇతర ప్రతిపక్ష నాయకులతో గానీ, ప్రజలతో స్వేచ్ఛగా మాట్లాడ లేనని నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేశారు.

ప్రజాస్వామ్య మూల స్తంభాలైన మూడు (మీడియా, న్యాయ, ఎన్నికల కమిషన్) వ్యవస్థలను పెగాసస్‌ ఆక్రమించుకుందని దీదీ నిప్పులు చెరిగారు. పేద ప్రజలకు తగినంత  నగదును అందుబాటులో ఉంచాల‌ని కోరితే, కోట్లాది రూపాయలను మోదీ స్పైయింగ్‌ గిరీకి ఖ‌ర్చు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.  

రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పైవేర్లకు కోట్లు ఖర్చు చేస్తారని ఆరోపించారు. పెగాసెస్‌పై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.