భారతరత్న అవార్డును తన తండ్రి కాలి గోటితో, కాలి చెప్పుతో పోల్చిన బాలకృష్ణకు సోషల్ మీడియాలో ట్రోల్ తప్పడం లేదు. బాలకృష్ణ ఎలాగూ చెప్పుల ప్రస్తావన తీసుకురావడంతో.. ఇంతకీ చెప్పులంటే అవి ఎన్టీఆర్ పై చంద్రబాబు వేయించినవేనా? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ.. తన బ్లడ్డూ బ్రీడు వేరన్నట్టుగా మరోసారి రెచ్చిపోయారు. ఆ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ను తక్కువ చేయడం, హాలీవుడ్ డైరెక్టర్ కామెరన్ సంవత్సరాలకు సంవత్సరాలు ఒకే సినిమాను తీస్తుంటాడంటూ.. తను ఒకేసారి మూడు సినిమాల్లో నటించేంత సత్తా ఉన్నోడినంటూ బాలయ్య డబ్బా కొట్టుకున్నాడు. అయినా పోలిక పెట్టడానికి కూడా ఒక అర్థం ఉండాలి.
తనకూ కామెరన్ కు పోలిక ఏమిటో బాలకృష్ణకే తెలియాలి. తొడ కొట్టుడు సినిమాల బాలకృష్ణ ఇలాంటి పోలికలతో కామెడీ కాక మరేం అవుతాడు? ఇప్పుడదే జరుగుతున్నట్టుగా ఉంది.
మరోవైపు ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ ను తెలుగుదేశం పార్టీ ఏడాదికి రెండు సార్లు చేస్తూ ఉంటుంది. దాదాపు 2009 నుంచి ప్రతి యేటా రెండు సార్లు టీడీపీ నుంచి ఈ డిమాండ్ వినిపిస్తూ ఉంటుంది. ఏదో మాట వరస కార్యక్రమంగా మారింది.
అధికారంలో ఉన్నప్పుడు, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడు మోడీకి చెప్పి ఒప్పించలేని చంద్రబాబు నాయుడు.. అంబేద్కర్ కే భారతరత్నను ఇప్పించిన చంద్రబాబు నాయుడు.. తన మామకు మాత్రం ఇప్పించలేకపోయాడు! అయితే ఇప్పటికీ టీడీపీ ఆ డిమాండ్ చేస్తూ ఉంటుంది.
ఆ భారతరత్న అవార్డునే ఇప్పుడు బాలకృష్ణ చెప్పుతో పోల్చారు. కాలి గోరు అన్నారు. మరి ఆ కాలి చెప్పుకోసమా? ఆ కాలి గోటి కోసమా టీడీపీ ఇంతలా దేబిరిస్తున్నది? అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతోంది.
ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన సమయంలో ఆయనపై చంద్రబాబు నాయుడు వేయించిన చెప్పుల అంశం కూడా ఇక్కడ చర్చకు రానే వస్తోంది. మొత్తానికి గత కొన్నేళ్లుగా తన మాట తీరుతో వివాదాల్లో చిక్కడం, కొన్ని మాటలు బ్యాక్ ఫైర్ కావడం బాలకృష్ణకు రొటీన్ గా మారినట్టుగా ఉంది.