హాలీవుడ్ క్లాసిక్ 'ఫారెస్ట్ గంప్' కు కార్బన్ కాపీగా రూపొందింది లాల్ సింగ్ చద్దా. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ .. టామ్ హాంక్స్ సినిమాకు నకలుగా అగుపిస్తోంది. ఇది ఫారెస్ట్ గంప్ కు రీమేక్ అంటూ దీని రూపకర్తలు ఇది వరకే ప్రకటించారు. ఫారెస్ట్ గంప్ 1994 నాటి సినిమా. ఇన్నేళ్ల తర్వాత దాన్ని రీమేక్ ఆలోచనే ఒక రకమైన సాహసం.
హాలీవుడ్ సినిమా అయినప్పటికీ.. అన్ని భాషల సినీ ప్రియులకూ బాగా చేరువైన క్లాసిక్స్ లో ఫారెస్ట్ గంప్ ఒకటి. ప్రత్యేకంగా మలుపులు, ట్విస్టులు గట్రా లేకుండా.. ఒక కల్పిత వ్యక్తి బయోపిక్ ఫారెస్ట్ గంప్. దానికి మూలం కూడా ఒక నవల. పేలవమైన నవలకు అద్భుత సినీ రూపకల్పనగా ఫారెస్ట్ గంప్ నిలుస్తుంది.
ఫారెస్ట్ గంప్ కథ ఏ మాత్రం కన్వీన్సింగ్ ఉండదు. ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసే ప్రయత్నం కూడా అందులో ఉండదు. ఎక్కడో మొదలైన ఆ వ్యక్తి కథ పొంతనలేని రీతిలో సాగుతూ ఉంటుంది. అయితే టామ్ హాంక్స్ నటన, అతడి క్యారెక్టర్ ప్రయాణం.. ఇదంతా ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ తరహా క్యారెక్టరైజేషన్ తో వచ్చిన భారతీయ సినిమాలు అంటే.. ఒక్క మాటలో 'స్వాతిముత్యం' సినిమాను ప్రస్తావించవచ్చు. స్వాతిముత్యంలో కమల్ హాసన్ మానసిక స్థితి ఎలాంటిదో ఫారెస్ట్ గంప్ కూడా అలాంటివాడే. స్వాతిముత్యం ఒక తరహా కథ అయితే, ఫారెస్ట్ గంప్ మరో తరహా కథ. వీటిని కాపీనో, మరోటో అనలేం. పూర్తి స్థాయిలో మానసిక పరివర్తన లేని ఒక సక్సెస్ ఫుల్ మ్యాన్ కథ ఫారెస్ట్ గంప్. అమెరికన్ సొసైటీ నుంచి పుట్టుకొచ్చిన పాత్ర, సినిమా అది.
మరి ఆ సొసైటీ కథ ఇండియాకు సెట్ కాదనే కాబోలు.. ఇన్నేళ్లైనా ఇంత వరకూ ఏ మూవీ మేకర్ కూడా ఫారెస్ట్ గంప్ ను కాపీ కొట్టే ప్రయత్నం చేయలేదు. ఆమిర్ ఖాన్ దాన్ని రీమేక్ సాహసం ఎంచుకున్నాడు. కార్బన్ కాపీగా రీమేక్ చేసినట్టుగా ఉన్నారు. ఇక ఒరిజినల్ లో ఉండే ఒక నల్ల సైనికుడి పాత్రలో నాగచైతన్య కనిపించాడు.