వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు ఎలాంటి విమర్శలు చేసినా సరే.. తెలుగుదేశం పార్టీ మహానాడు వారు భయపడినట్లుగా కాకుండా సక్సెస్ అయిన మాట నిజం. అయితే ఆ సక్సెస్ ఎలా దక్కింది? ఏ కారణాల చేత పార్టీ అగ్ర నాయకులు ఊహించనదానికంటె ఎక్కువ మంది జనం తరలివచ్చారు? అనేది కీలకమైన చర్చనీయాంశం. అయితే మహానాడుకు కొన్ని రోజుల ముందునుంచి చంద్రబాబునాయుడు చాలా వ్యూహాత్మకంగా ఒక మాట చెబుతూ వచ్చారు. ఆ మాట మంత్రంలాగా పనిచేసి జనం వెల్లువలా రావడానికి కారణమైనట్లుగా తెలుస్తోంది.
అసలు మహానాడు ప్లాన్ చేసినప్పటి నుంచి హాజరు కాగల కార్యకర్తలు జనం గురించి తెలుగుదేశం పార్టీ చాలా ఆందోళన చెందుతూనే వచ్చింది. ఎందుకంటే.. గత మూడేళ్లుగా కూడా.. రాష్ట్రస్థాయిలో ఎలాంటి ప్రజా ఉద్యమానికి పార్టీ పిలుపు ఇచ్చినప్పటికీ.. అవి ఎంత పేలవంగా జరుగుతూ వచ్చాయో వారందరికీ తెలుసు. పట్టుమని పదిమంది కార్యకర్తలు కూడా లేకుండా టీడీపీ నియోజకవర్గ కేంద్రాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించింది. అలాంటిది మహానాడుకు తరలివచ్చే జనం ఎందరుంటారో అని భయపడ్డారు.
జనం లేకుండా తేలిపోతే.. అధికార పార్టీ మీద నిందలువేయడానికి ముందునుంచే రంగం సిద్ధం చేశారు. కార్యక్రమానికి ఎవ్వరినీ రానివ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని, ఆర్టీసీ బస్సులు అడిగితే ఇవ్వడం లేదని రకరకాల ఆరోపణలు చేశారు. అయితే వారు అనుకున్న దానికంటె జనం ఎక్కువే వచ్చారు. అలా ఎక్కువ మంది రావడానికి చంద్రబాబు ప్రయోగించిన ఒక మంత్రమే కారణం.
చంద్రబాబునాయుడు మహానాడుకు కొంతకాలం ముందునుంచి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చునంటూ పదేపదే అంటున్నారు. దీనికి తన వద్ద బలమైన కారణాలు ఉన్నాయని కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారు ఈ వాదనను కొంత వరకు నమ్మారు. ఏ పుట్టలో ఏముందో అనుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ టాప్ గేర్ లో నడుస్తున్నాయి గనుక.. ఈ సమయాన్ని ఎడ్వాంటేజీగా మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే గనుక.. ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదని చాలా మంది నియోజకవర్గ స్థాయి నాయకులు అనుకున్నారు.
వచ్చే మహానాడుకంటె ముందుగానే ఎన్నికలైనా వస్తాయి.. లేదా ఈ ఏడాది వ్యవధిలోనే చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయిపోవచ్చు అనే ఆలోచన కూడా వారికి ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బలప్రదర్శనకు వేదికగా మహానాడును మార్చుకున్నారు. తమ తమ ఊర్లనుంచి పెద్దసంఖ్యలో కిరాయి కార్యకర్తలను తరలించారు. ఫలితంగా మహానాడుకు అనుకున్నదానికంటె ఎక్కువ మంది జనం వొచ్చారు.
ముందస్తు ఎన్నికలు ఉంటాయనే చంద్రబాబు మాట మంత్రంలా పనిచేసింది. కానీ అది అబద్ధపు మంత్రమే అని వారికి అర్థమయ్యే సరికి ఏడాదిపైగానే పడుతుంది. జగన్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తుకు వెళ్లదని ఆ పార్టీ నాయకులు చెబుతుండగా.. టీడీపీ వారు బాబు మాటల్ని నమ్మి.. మహానాడుకు జనాన్ని తరలించారంటేనే.. గొర్రె కసాయిని మాత్రమే నమ్ముతుందనే సామెత నిజం అనిపిస్తుంది.