హీరోహీరోయిన్లు ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్లిచ్చే స్టేట్ మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. పెళ్లి తర్వాత జీవితం మారిపోయిందని కొందరంటారు. మరికొందరేమో లైఫ్ చాలా కొత్తగా, కలర్ ఫుల్ గా ఉందంటారు. ఇంకొందరు జీవితం చాలా సిస్టమాటిక్ అయిందని చెప్పుకొస్తారు. కానీ హీరోయిన్ ప్రణీత మాత్రం తన పెళ్లిపై చాలా సాదాసీదాగా స్పందించింది.
పెళ్లి తర్వాత తన జీవితంలో పెను మార్పులు జరగలేదంటోంది ప్రణీత. గతంలో ఎలా ఉండేదో, పెళ్లి తర్వాత కూడా అలానే సింపుల్ గా ఉందని, పెద్దగా మార్పులేవీ జరగలేదంటోంది. పెళ్లి టైమ్ లో చేతిలో 2 హిందీ సినిమాలున్నాయని, వాటిని పూర్తిచేసి, ఆ సినిమాల ప్రచారంలో బిజీ అవ్వడంతో.. పెళ్లి తర్వాత తనకేం కొత్తగా అనిపించలేదంటోంది.
నిజానికి ప్రణీత పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే సీక్రెట్ గా జరిగిపోయింది. కాబట్టి ఆమె జీవితంలో పెళ్లి సందడి అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత కూడా ఆమె ఎలాంటి హంగామా పెట్టుకోలేదు.
కరోనా/లాక్ డౌన్ వల్ల భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ వెంటనే ప్రణీత సినిమాలకు షిఫ్ట్ అవ్వడం, ఆమె భర్త నితిన్ రాజు, బిజినెస్ వ్యవహారాల్లో పడిపోవడంతో.. పెళ్లి మజాను ఆస్వాదించలేకపోయిందట ఈ బ్యూటీ.
కరోనా వేళ పౌరులకు, రోగులకు ఎంతో సేవ చేసిన ప్రణీత, ఇప్పటికీ తన ఛారిటీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు సాయం చేస్తే మనసుకు చాలా తృప్తిగా ఉంటుందని, ప్రతి ఒక్కరు తమకు తోచినంత సాయం చేయాలని కోరుతోంది.