పోర్న్ రాకెట్ వ్యవహరంలో పోలీసులు అరెస్టు చేసిన వ్యాపారవేత్త, శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన గతంపై ఇప్పుడు చర్చ ఊపందుకుంటోంది. రాజ్ కుంద్రా దాదాపు పదేళ్లకు పై నుంచినే మీడియా ద్వారా అందరికీ పరిచితం.
ప్రత్యేకించి ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ సహ యజమానిగా కుంద్రా పేరు 14 యేళ్ల కిందటే బాగా మార్మోగింది. ఆ తర్వాత విలాసాలు, వివాదాల విషయంలో రాజ్ కుంద్రా పేరు వినిపిస్తోంది. ఇటీవలే వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా బోల్డ్ కామెంట్లు చేసి కుంద్రా వార్తల్లో నిలిచాడు. తన మాజీ భార్య అక్రమ సంబంధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంతలో ఇప్పుడు ఆయనే పోర్న్ వ్యవహారంలో ఇరుక్కున్నాడు. ఈ అంశంపై ముంబై పోలీసుల విచారణ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వీరి గత విలాసాలు కూడా చర్చకు నోచుకుంటున్నాయి.
అసలు రాజ్ కుంద్రాకు అంత డబ్బు ఎలా వస్తోంది? ఎంతసేపూ బాలీవుడ్ పార్టీల్లోనే కనిపిస్తూ, సరదా సరదాగా ఎలా గడుపుతుంటాడు? అనే ప్రశ్న ఈనాటిది కాదనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. గతంలో కామెడీ విత్ కపిల్ కు హాజరయినప్పుడే ఆ హోస్టు కుంద్రాను ఈ ప్రశ్న అడిగాడట.
అయితే అప్పట్లో ఆ ప్రశ్నకు రాజ్ కుంద్రా నవ్వునే సమాధానంగా ఇచ్చాడట. దీనిపై శిల్ప స్పందిస్తూ.. తన భర్త చాలా కష్టపడతాడంటూ చెప్పింది. ఎంతసేపూ పార్టీల్లోనే సరదాగా కనిపించినా, పని చేసుకునే సమయాల్లో సర్వం మరిచిపోయి పని చేస్తాడంటూ తన భర్తకు శిల్ప కితాబిచ్చింది. పోర్న్ వ్యవహారంలో దొరికిపోయిన నేపథ్యంలో రాజ్ కుంద్రా ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు ఇలా చర్చనీయాంశం అవుతున్నాయి.