జ‌గ‌న్‌పై ‘క‌డ‌ప’ నిట్టూర్పు!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా వాసులు నిట్టూర్పు విరుస్తున్నారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌ను పోల్చుకుంటూ… ఇద్ద‌రికీ ఎంత తేడా అని చ‌ర్చించుకుంటున్నారు. 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎం…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా వాసులు నిట్టూర్పు విరుస్తున్నారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌ను పోల్చుకుంటూ… ఇద్ద‌రికీ ఎంత తేడా అని చ‌ర్చించుకుంటున్నారు. 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎం అయ్యారు. సీఎంగా ఉన్న‌న్ని రోజులు క‌డ‌ప జిల్లాపై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సారించారు.

వైఎస్సార్ హ‌యాంలో క‌డ‌ప ఎంతో పురోగ‌తి సాధించింది. త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు అండ‌గా నిలిచిన క‌డ‌ప రుణాన్ని తీర్చుకోడానికి ఎన్ని నిధులైనా ఖ‌ర్చు చేయ‌డానికి సిద్ధ‌మ‌ని ఎన్నోమార్లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. క‌డ‌ప‌కు మాత్ర‌మే వైఎస్సార్ సీఎం అయిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. వాటిని వైఎస్సార్ ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు.

వైఎస్సార్ హ‌యాంలో క‌డ‌ప‌కు రిమ్స్ వైద్య‌శాల‌, మెడిక‌ల్‌, డెంట‌ల్ క‌ళాశాల‌లు, ఇడుపుల‌పాయ‌లో ట్రిపుల్ ఐటీ, పులివెందుల‌లో జేఎన్‌టీయూ, ప్ర‌పంచ స్థాయి ప‌శుప‌రిశోధ‌న సంస్థ‌, క‌డ‌ప పీజీ సెంట‌ర్ యోగివేమన విశ్వ‌విద్యాల‌యంగా అప్‌గ్రేడ్‌, అధునాత‌న క‌లెక్ట‌రేట్ నిర్మాణం, గండికోట‌, స‌ర్వ‌రాయ‌సాగ‌ర్‌, బ్ర‌హ్మంసాగ‌ర్‌, పైడిపాళెం జ‌లాశ‌యాలు…ఇలా ఒక‌టా రెండా? ఎన్నెన్నో ప్రాజెక్టుల‌ను తీసుకొచ్చిన ఘ‌న‌త వైఎస్సార్‌ది. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం ఒక్క క‌డ‌ప జిల్లానే కాదు యావ‌త్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా పెద్ద దిక్కును కోల్పోయిన భావ‌న‌.

వైఎస్సార్ త‌న‌యుడు జ‌గ‌న్ ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. క‌నీసం సొంత జిల్లాలో కూడా ఆయ‌న అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ముఖ్యంగా క‌డ‌ప జిల్లా అంత‌టిని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప‌నులు చేయ‌డం లేదు. కేవ‌లం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌పై మాత్ర‌మే జ‌గ‌న్ దృష్టి సారించారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఉక్కు ప‌రిశ్ర‌మ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. అలాగే కొప్ప‌ర్తిని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాన‌ని గొప్ప‌లు చెప్పారు. అలాగే నూత‌న క‌లెక్ట‌రేట్ మార్గంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాప‌నే త‌ప్ప‌, ఇంత వ‌ర‌కూ అది పూర్త‌యిన దాఖ‌లాలు లేవు. రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలో వంద‌ల కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌నే త‌ప్ప ఎలాంటి పురోగ‌తి లేద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వాపోతున్నారు.

ప్ర‌తి ప‌ర్య‌ట‌న‌లోనూ శంకుస్థాప‌న‌లు త‌ప్ప‌, నిధులు విడుద‌ల‌, ప‌నుల ఊసేలేదు. జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వ‌చ్చిన జ‌గ‌న్ కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం కావ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు, కొప్ప‌ర్తిలో ప‌రిశ్ర‌మ‌ల మాటేమిట‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై సొంత జిల్లా వాసులు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం వెనుక స‌హేతుక కార‌ణాలున్న‌ట్టే క‌నిపిస్తోంది.