వారిది ఓవరాక్షన్.. వీరిది దానికి డబల్!!

ఒక యాక్షన్ అంటూ జరిగితే దానికి సమానమైన రియాక్షన్ అనేది కూడా ఉంటుందని ఫిజిక్స్ మనకు చెబుతుంది. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందనేది దీని అంతరార్థం!! Advertisement కానీ కొన్ని సందర్భాల్లో ఒక…

ఒక యాక్షన్ అంటూ జరిగితే దానికి సమానమైన రియాక్షన్ అనేది కూడా ఉంటుందని ఫిజిక్స్ మనకు చెబుతుంది. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందనేది దీని అంతరార్థం!!

కానీ కొన్ని సందర్భాల్లో ఒక యాక్షన్ జరిగితే, రియాక్షన్ అనేది దానిని మించి ఉండవచ్చు! అలాంటప్పుడు ఒక ఓవరాక్షన్ జరిగితే.. దాని రియాక్షన్ డబల్ ఓవరాక్షన్ గా ఉండినా ఆశ్చర్యం లేదు! తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఇలాంటి తమాషాల ఓవరాక్షన్ లకు వేదిక అవుతున్నాయి.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పార్లమెంట్ నియోజకవర్గాలలో తిరిగే కార్యక్రమంలో భాగంగా ఆమె ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ లోని సొసైటీ కార్యాలయంలో నడుస్తున్న ఒక రేషన్ దుకాణాన్ని విజిట్ చేసిన నిర్మలా సీతారామన్, తన వెంట ఉన్న కలెక్టర్ సహా అక్కడి అధికారులపై నిప్పులు చెరిగారు.

కేంద్రం అందిస్తున్న రేషన్ బియ్యం ఎలా అందుతోందో ఆమె ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించి అక్కడ అధికారులు ఒకరిద్దరిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. రవాణా, గోడౌన్ ఖర్చులు కూడా భరించి కేంద్రం బియ్యం సరఫరా చేస్తున్నందున ఆ దుకాణం వద్ద ప్రధాని మోడీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సిందేనంటూ ఆమె హుకుం జారీ చేశారు.

‘తమ పార్టీ వారు ప్రధాని ఫ్లెక్సీ ని ఏర్పాటు చేస్తే దానిని కొందరు తొలగిస్తున్నారు’ అంటూ ఆగ్రహించారు. అక్కడికి ఒక ఫ్లెక్సీ తెచ్చి పెట్టవలసిందిగా అప్పటికప్పుడు తమ పార్టీ వారిని పురమాయిస్తూ.. దాన్ని ఎవరు దెబ్బతీయకుండా చించేయకుండా చూడవలసిన బాధ్యత కలెక్టర్‌దేనని హెచ్చరించారు. తను మళ్ళీ ఇక్కడకు వస్తానని అప్పటికి ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్స్ ఉండాలని ఆమె పట్టుబట్టారు.

కేంద్ర మంత్రి స్థాయిలో ఒక రాష్ట్రంలో పర్యటనకు వచ్చి.. విధానపరమైన విషయాలు, పథకాల అమలు పరిశీలించడంతో ఆగకుండా రేషన్ దుకాణం వద్ద ప్రధాని ఫోటో పెట్టి తీరాల్సిందే అంటూ నిర్మల సీతారామన్ రభస చేయడం ఒక ఎత్తు.

విధానపరంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని కేంద్రం తరఫునుంచి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించవచ్చు. కేంద్రం డబ్బులతో ప్రధాని ఫోటోఫ్రేములను తయారు చేయించి పంపవచ్చు. అలా చేయకుండా,  ప్రభుత్వ కార్యాలయం వద్ద ఫ్లెక్స్ పెట్టాల్సిందే అంటూ తమ ‘పార్టీ వారిని’ ఎలా పురమాయిస్తారో అర్థం కాని సంగతి. మొత్తానికి కేంద్రమంత్రి చేసిందే ఓవరాక్షన్ అనుకుంటే తెలంగాణ మంత్రి హరీష్ రావు అంతకుమించి రెట్టింపు చేస్తున్నారు.

కేంద్రానికి అత్యధికంగా పన్నుల వాటా చెల్లిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి అంటున్నారు. కేంద్రం నుంచి తెలంగాణ పొందుతున్న వాటా కంటే పన్నుల రూపంలో చెల్లిస్తున్న వాటా చాలా ఎక్కువ అనేది ఆయన విశ్లేషణ. తెలంగాణ చెల్లిస్తున్న అదనపు సొమ్ముతో కొన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులిస్తున్నదనేది ఆయన వాదన. కాబట్టి ఆయా రాష్ట్రాలు అన్నింటిలోనూ కేసీఆర్ ఫోటో పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 

హరీష్ రావు చేసిన వాదన మొత్తం నిజమే అనుకున్నా కూడా.. కేంద్రానికి అతిగా పన్నుల వాటా చెల్లించే ఐదారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోటోలు పెట్టాలి కదా.. అలా కాకుండా కేసీఆర్ ఫోటో మాత్రం పెట్టాలని హరీష్ డిమాండ్ చేయడం డబుల్ ఓవరాక్షన్ అన్నట్లుగా ఉంది.

ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తున్నాం వారికి ఎలా అందుతోంది అనే అంశాల్లో గొడవపడితే బాగానే ఉంటుంది కానీ ప్రధాని ఫోటో ఎక్కడ పెట్టాలి.. కేసీఆర్ ఫోటో ఎక్కడ పెట్టాలి.. అనే విషయాల మీద కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి స్థాయిలోని పెద్ద నాయకులు తమ ఫోకస్ పెట్టడం సిగ్గుచేటు అని ప్రజలు భావిస్తున్నారు.