పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయి. ఆయనను వారు జస్ట్ ఒక సినిమా హీరోగా చూడరు. దేవుడిగా భావిస్తారు. ఆ అభిమానం గుండెలలో ఉంచుకుంటే మంచిదే. కానీ అది హద్దులు దాటేసింది. ఏకంగా వీరంగమే సృష్టించేసింది. దాంతో ఏ హీరోకైతే తాము అభిమానులమని చెప్పుకున్నారో అదే హీరో ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా వ్యవహరించారు అన్న చెడ్డ పేరుని మూటకట్టుకున్నారు.
విశాఖలోని ఒక సినిమా థియేటర్ లో పవన్ జల్సా సినిమా స్పెషల్ షో ప్రదర్శితం అవుతూండగా ఫ్యాన్స్ సృష్టించిన అల్లరికి వీరంగానికి థియేటర్ తెర ఒక్కసారిగా లేచిపోయి పొరలు పొరలుగా చిరిగిపోయింది. పైనున్న సీలింగ్ ద్వంసం అయింది. హాలులోని ఉన్న కుర్చీలు విరగ్గొట్టేశారు. బీరు బాటిల్స్ విరగగొట్టి థియేటర్ లో చిందవర వందర గందర గోళం సృష్టించారు.
థియేటర్ కెపాసిటీ 700 మంది అయితే రెట్టింపు జనాలు రావడంతో పాటు జల్సా సినిమా ప్రదర్శితం అవుతున్నంతసేపూ అలజడే క్రియేట్ చేశారు. దాంతో థియేటర్ చిన్నాభిన్నమైంది. పోలీసుల సాయాన్ని థియేటర్ యాజమాన్యం కోరినా ఫ్యాన్స్ దూకుడు చూసి వారు కూడా చేతులెత్తేశారు.
ఈ విధంగా జల్సా సినిమా సాక్షిగా తమ జల్సా ఏంటో చూపించి ఫ్యాన్స్ తాపీగా ఇంటికెళ్ళిపోయారు. కానీ పవన్ పుట్టిన రోజున స్పెషల్ షో వేసి ఫ్యాన్స్ కి ఆనందం కలిగిద్దామనుకున్న థియేటర్ యజమాని మాత్రం తలపట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. సర్వనాశనం అయిన థియేటర్ కి వచ్చిన నష్టం చూస్తే పదిహేను నుంచి ఇరవై లక్షలుగా లెక్క తేల్చారు. దీన్ని ఎవరు భరిస్తారు బాబూ అని ఆ యాజమాన్యం గోడు పెడుతోంది.
హీరో మీద అభిమానం ఉండాలి కానీ అది హద్దు మీరకూడదు, అన్నింటికీ మించి తమ అభిమాన హీరో పేరు పెంచేలా ఉండాలి. పవన్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు రాజకీయ పార్టీ నాయకుడు. మరి ఇలా వీరంగం చేస్తే అది తమ హీరో మీద ఆయన పార్టీ మీద కూడా పడుతుంది అన్న ఆలోచన కొందరు అతి ఉత్సాహవంతులైన ఫ్యాన్స్ లో లేకపోవడమే ఇలాంటి వాటికి కారణం అంటున్నారు.