విదేశాలలో ఎంబీబీఎస్ తత్సమానమైన వైద్య విద్యా కోర్సుల్లో చేరదలచుకున్న అభ్యర్ధులు కచ్చితంగా నీట్లో అర్హత సాధించాలని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్పష్టం చేశారు. రాజ్య సభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ నిబంధనల ప్రకారం విదేశాలలో వైద్య విద్య అభ్యసించాలంటే ప్రతి అభ్యర్ధి ఏంసీఐ నుంచి ఎలిజిబులిటీ సర్టిఫికెట్ను పొందాల్సి ఉండేది. ఈ నిబంధనలను సవరిస్తూ 2018 మార్చిలో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం విదేశాలలో వైద్య విద్య అభ్యసించాలనుకునే అభ్యర్ధులు నీట్లో తప్పని సరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. నీట్లో అర్హత సాధించిన అభ్యర్ధులు ఎంసీఐ నుంచి ఎలిజిబులిటీ సర్టిఫికెట్ పొందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు.
గడిచిన మూడేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా 48 దేశాలలో ఎంబీబీఎస్ లేదా తత్సమానమైన మెడికల్ కోర్సులు అభ్యసిస్తున్న అభ్యర్ధులు 41562 మంది ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీరిలో అత్యధికం చైనాలో చదువుతున్నారు. గడిచిన మూడేళ్ళలో చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్ధుల సంఖ్య 8,328.
భారతీయ విద్యార్ధులు అత్యధిక సంఖ్యలో ఎంబీబీఎస్ చదువుతున్న దేశాలలో చైనా అగ్రస్థానంలో ఉండగా, జార్జియా, కిర్గిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ మొదటి పది స్థానాల్లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. విదేశాల్లో మెడిసిన్ చదవడానికి అనుమతి కోరుతూ 2019 జనవరి వరకు ఎంసీఐకి 4558 దరఖాస్తులు అందగా వాటిలో అత్యధికులు చైనాలో చదవేందుకు దరఖాస్తు చేశారని చెప్పారు.
35 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ…
ఉజాలా పథకం కింద దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి గృహ వినియోగదారులకు 35 కోట్ల 16 లక్షల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసినట్లు విద్యుత్ శాఖ సహాయ మంత్రి కే.కే. సింగ్ మంగళవారం రాజ్య సభకు తెలిపారు. వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఉజాలా పథకం కింద పంపిణీ చేస్తున్న ఎల్ఈడీ బల్బులు నాణ్యతా నియంత్ర ప్రమాణాలకు లోబడి ఉంటాయని చెప్పారు.
దేశీయ కంపెనీలు, విదేశీ కంపెనీలు సైతం ఎల్ఈడీ బల్బుల తయారీ విషయంలో ఈ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. మార్కెట్లో ఉన్న తయారీదారులు ఇప్పటి వరకు 111 కోట్ల ఎల్ఈడీ బల్బులను విక్రయించినట్లు తెలిపారు. ఉజాలా పథకం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గృహ వినియోగదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎల్ఈడీ బల్బులలో విఫలమవుతున్న బల్పుల శాతం అతి తక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైందని మంత్రి చెప్పారు.