నెలనెలా ఉద్యోగస్తులు జీతం అందుకున్నట్టు ఒకటో తేదీనే సామాజిక పింఛన్ డబ్బులు తీసుకునేవారు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. ప్రభుత్వం మారినా పద్ధతి మారకుండా జాగ్రత్తగా సామాజిక పింఛన్ల పథకాన్ని అమలు చేస్తున్నారు సీఎం జగన్. 2వేల నుంచి 3వేల రూపాయలకు పెంచుకుంటూ పోతానన్న మాటకి కట్టుబడి మొదటి నెలలోనే 250 రూపాయలు పెంచి ఇచ్చారు. అయితే ఈనెల మాత్రం పింఛన్లు లేటయ్యాయి.
ఒకటో తేదీ పింఛన్ వస్తుందని ఎదురు చూసిన పండుటాకులు కాస్త కంగారు పడ్డాయి. కారణం 8వతేదీ వరకు రాదు అని అధికారులు చెప్పడం. ఈనెల 8వతేదీ వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా పింఛన్లు పంపిణీ మొదలు పెడతామని అధికారులు నింపాదిగా ప్రకటించారు. వారం రోజుల పాటు అనివార్యంగా వేచి చూడాల్సిన పరిస్థితుల్లోకి లబ్ధిదారుల్ని నెట్టేశారు.
దీన్ని ఓ అస్త్రంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. జగన్ వచ్చీ రావడంతోనే పింఛన్లు ఆలస్యమవుతున్నాయని, ఇకపై ఇస్తారో లేదో అంటూ దుష్ప్రచారం మొదలు పెట్టాయి. టీడీపీ ఓవర్ యాక్షన్ పక్కనపెడితే.. జనసామాన్యంలో మాత్రం వారం రోజులు పింఛన్లు లేట్ గా వస్తాయనే విషయంపై అసంతృప్తి ఉంది. దానికి కారణం మహానేత జయంతి అని చెప్పడం కూడా అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టయింది. జయంతి కోసం మా పింఛన్లు ఆలస్యం చేస్తారా అని చాలామంది వృద్ధులు వాపోతున్నారు.
అయితే ఈ వ్యవహారంపై సీఎం జగన్ కి సమాచారం లేదనే విషయం స్పష్టమైంది. సామాజిక పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడానికి కారణం అధికారులేనని తేలుతోంది. కొంతమంది ఉన్నతాధికారులు తమ సొంత నిర్ణయంతో పింఛన్లను లేట్ చేశారు. దీనికి సీఎం ఆమోదం కూడా తీసుకోలేదు. అసలు సీఎం పేషీకి సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో తను చేయని తప్పుకు ముఖ్యమంత్రి జగన్ నిందలు పడాల్సి వస్తోంది.
ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకుపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టీడీపీ, దాని అనుకూల మీడియా జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. కాబట్టి వైసీపీ మరింత అలర్ట్ గా ఉండటం మంచిది. కొంతమంది కిందిస్థాయి నేతలు పింఛనుదారులు పడే ఇబ్బందిని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మొత్తమ్మీద అధికారుల అత్యుత్సాహం సీఎం జగన్ పై విమర్శలకు తావిస్తోంది.