తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారాలోకేష్ ఈ మధ్య ట్విట్టర్లో ఎక్కువగా కన్పిస్తున్నారు. అదేనండీ, ట్వీట్లేస్తున్నారు ఎడాపెడా.! మంగళగిరి నుంచి పోటీచేసి ఓడిపోయిన తర్వాత లోకేష్ కొన్నాళ్ళు సైలెంటయిపోయారు. కాస్త తీరిక చేసుకుని, మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఇలా ట్విట్టర్లో చెలరేగిపోతున్నారు. 'కొత్త ప్రభుత్వానికి ఆరునెలల సమయం ఇస్తాం.. ఆ తర్వాత బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీస్తాం..' అని చెప్పిన టీడీపీ, నెల తిరగకుండానే 'యూటర్న్' తీసుకుని, జగన్ సర్కార్‌పై అడ్డగోలు విమర్శలు షురూ చేసింది.
ట్వీటేషు.. అదేనండీ లోకేష్ అయితే, మరీ టూ మచ్‌గా ట్విట్టర్‌ని వాడేస్తున్నారు జగన్ ప్రభుత్వంపై నిందలేయడానికి. ఈ క్రమంలో నారా లోకేష్ ట్వీట్లకు వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ మాటెలా వున్నా, నెగెటివ్ రెస్పాన్స్ మాత్రం అదిరిపోతోంది. 'గత ఐదేళ్ళూ ఇలాంటి అంశాలపై ఎందుకు మాట్లాడలేదయ్యా.?' అని కొందరు ప్రశ్నిస్తోంటే, చాలామంది మాత్రం, 'ఆ విమర్శలేవో ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చేయొచ్చుగా..' అంటూ సలహాలిస్తున్నారు.
ఇంకా నయ్యం.. ట్వీట్లలో వున్న స్పష్టతని లోకేష్‌గారి ప్రెస్ మీట్ నుంచి ఆశించగలమా.? ఎన్నికల పోలింగ్ డేట్‌ని కూడా సరిగ్గా చెప్పలేని నారా లోకేష్‌ని ఇంత దారుణంగా 'ర్యాగింగ్' చేస్తే ఎలా సుమీ.! అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాపం ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో విత్తనాల కొరత సుస్పష్టం. కానీ, దానికి కారణం గత ప్రభుత్వమే కదా.! నెలరోజుల క్రితం ఏర్పడిన ప్రభుత్వం, ఆఘ మేఘాల మీద విత్తనాల పంపిణీ చేయాలనుకున్నా, గత ప్రభుత్వం ఆ అవకాశం ఇచ్చి వుండాలి కదా.!
పెన్షన్ల విషయంలోనూ లోకేష్ ట్వీటు బ్యాక్ ఫైర్ అయ్యింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నేపథ్యంలో, పెన్షన్ల పంపకం ఒకటో తేదీ నుంచి 8వ తేదీకి వాయిదా పడిందంతే.. అదీ పెరిగిన పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకోసం జరిగిన ఆలస్యం మాత్రమే అది. మొత్తమ్మీద, ట్వీట్లేసి.. పండగ చేసుకుంటున్న నారాలోకేష్, ఆ ట్వీట్ కింద జనాల నుంచి వస్తోన్న కామెంట్స్ చదవగలిగితే, మళ్ళీ ఇంకో ట్వీటేసే అవకాశం వుండదు.
అయినా, జనం కోరుతున్నట్లు.. కాస్తంత నారాలోకేష్, ట్విట్టర్‌ని వీడి, ప్రెస్ మీట్‌కి వస్తే బావుంటుందేమో.! ఎంచక్కా రెట్టించిన కామెడీని ఆయన ప్రదర్శించేయొచ్చు.