తన గురించి, తన తెలివితనం గురించి లోకేష్ బాగానే చెప్పుకుంటూ ఉంటారు. తనకు అర్థం కాని విషయాలు, తనకే సాధ్యం అయ్యే విషయాల గురించి ఆయన అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. అప్పట్లో ఐటీ శాఖా మంత్రిగా ఏపీకి కంపెనీలను రప్పించడం విషయంలో లోకేష్ తన చేవ గురించి చెప్పుకోవడం.. ఒక మచ్చుతనక! లోకేష్ పండించిన కామెడీ ఎపిసోడ్లలో అది కూడా ఒకటి.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు తనకు అంతుబట్టని, తనకు అస్సలు అర్థం కాని ఒక విషయాన్ని వ్యక్త పరిచారు చంద్రబాబు నాయుడి తనయుడు. అదేమిటంటే..ఇంతకీ ఏపీలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీనా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనా.. అనేది లోకేష్ కు అస్సలు అర్థం కావడం లేదట!
అదీ సంగతి. ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నారో తనకు అర్థం కావడం లేదని లోకేష్ బాబు చెప్పుకున్నారు. ట్విటర్ లో మాత్రమే స్పందించే లోకేషుడు.. అక్కడే ఈ సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు.
ఇంతకీ ఈ డౌట్ ఆయనకు ఎందుకొచ్చిందో తెలుసా.. వివిధ సమస్యల విషయంలో చంద్రబాబు నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది కదా, అందుకు లోకేష్ కు డౌటొచ్చిందట. చంద్రబాబు నాయుడు ఐదేళ్లుగా వెలగబెట్టిన ఘనకార్యాలను ప్రజలే ఛీ కొట్టారు. తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు. ఈ నేఫథ్యంలో ఆ అంశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది.
ఏపీ ఆర్థిక వ్యవస్థను తెలుగుదేశం పార్టీ అధినేత ఛిన్నాభిన్నం చేసిన తీరు గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. అలాగే విత్తన సేకరణ అనేది నాలుగైదు నెలల ముందే చేయాల్సిన పని. దాన్ని చంద్రబాబు సర్కారు సరిగా చేయలేదు. దీంతో ఇప్పుడు విత్తన పంపిణీ ఇబ్బంది అవుతూ ఉంది.
ఇలాంటి నేఫథ్యంలో.. ఈ అంశాలనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. దీంతో లోకేష్ కు పై సందేహం వచ్చిందట! మరి ఈ సందేహ నివృత్తి కోసం లోకేష్ ప్రత్యేకంగా ట్యూషన్లు పెట్టించుకుంటే బాగుంటుందని పరిశీలకులు అంటున్నారు.