‘బఖర్ ఈద్’ నుంచి విలువలు నేర్చుకుందాం!

ఇస్లాం ధర్మాన్ని పాటించే వాళ్లందరూ రంజాన్ తర్వాత అత్యంత పవిత్రంగా, ప్రధానంగా ఆచరించే పండుగల్లో బక్రీద్ ఒకటి. ఈ పండుగను మనదేశంలో ‘బఖర్ ఈద్’ అంటాం. దీని అసలు పేరు ‘ఈదుల్ అజ్‌హా’! ఇస్లాంలోని…

ఇస్లాం ధర్మాన్ని పాటించే వాళ్లందరూ రంజాన్ తర్వాత అత్యంత పవిత్రంగా, ప్రధానంగా ఆచరించే పండుగల్లో బక్రీద్ ఒకటి. ఈ పండుగను మనదేశంలో ‘బఖర్ ఈద్’ అంటాం. దీని అసలు పేరు ‘ఈదుల్ అజ్‌హా’! ఇస్లాంలోని త్యాగబుద్ధి, అచంచలమైన భగవద్భక్తికి నిదర్శనం ఈ పండుగ. కేవలం భక్తి, త్యాగం మాత్రమే కాదు.. సామాజిక జీవన శైలుల పరంగా కూడా మంచి మార్గాన్ని నిర్దేశించే పండుగ.

బక్రీద్ పండుగ ఎలా వచ్చిందంటే..

అల్లాహ్ (భగవంతుడు) పంపిన 80వేల మంది ప్రవక్తల్లో హజ్రత్ ఇబ్రహీం కూడా ఒకడు. భగవంతుని పట్ల అచంచల విశ్వాసంతో ప్రజలకు ధర్మమార్గాన్ని చెబుతుండేవాడు. ఆ ఇబ్రహీం- హజీరా దంపతులకు వయస్సు పైబడిన తర్వాత కొడుకు పుట్టాడు. అతడు ఇస్మాయిల్. వృద్ధదంపతులు- ఆ కొడుకు ఇస్మాయిల్ ను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సమయంలో తన కొడుకును అల్లాహ్‌కు బలి ఇస్తున్నట్టుగా ఒకరోజు ఇబ్రహీంకు కలవస్తుంది. కల గురించిన వివరాన్ని కొడుకుతో చెబుతాడు. 

ఇస్మాయిల్ కూడా భగవంతుడి ఆదేశాన్ని ఖుర్మానీ కావడానికి తన సంసిద్ధత వ్యక్తం చేస్తాడు. కలలో అలా కనిపించడం అంటే.. అది భగవంతుడు నిర్దేశించిన కార్యమే అనే విశ్వాసంతో సంతోషంగా అంగీకరిస్తాడు. పైగా ఇస్మాయిల్ తండ్రికి ఒక సలహా కూడా ఇస్తాడు. కన్నకొడుకును బలిఇచ్చే సమయంలో ఇబ్రహీంకు పుత్రప్రేమ అడ్డు వచ్చే ప్రమాదం ఉన్నది గనుక.. కళ్లకు నల్లటి గుడ్డను గంతలుగా కట్టుకుని తనను బలి ఇవ్వమని తండ్రికి సూచిస్తాడు. 

అదే ప్రకారం కళ్లకు గంతలు కట్టుకున్న ఇబ్రహీం కత్తిని కొడుకు మెడపై ఉంచి ఖుర్మానీ చేయబోతుండగా.. అల్లాహ్ వారి భక్తికి, అచంచలమైన విశ్వాసానికి, దృఢచిత్తానికి, త్యాగబుద్ధికి మెచ్చి, బలికాబోతున్న ఇస్మాయిల్ స్థానంలో ఒక దుంబా ను ఉంచుతాడు. దాని మెడ తెగి పడుతుంది. (దుంబా అంటే మనకు తెలిసిన పొట్టేలు వంటి జంతువు.) అల్లాహ్ అనుగ్రహానికి తండ్రీ కొడుకులు సంతోషిస్తారు. ఈ సందర్భంగా ఈ రోజున జంతుబలి ఇవ్వాలని, అది యుగాంతం వరకు కొనసాగాలని అల్లాహ్ నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతుంది.  

ఇబ్రహీం- ఇస్మాయిల్ ల సమర్పణ భావానికి సంబంధించిన ప్రశంస, ప్రస్తావన్ ఖురాన్ గ్రంథంలోని 37వ సూరా అల్-సాప్ఫత్ లో 104-110 ఆయత్ లలో ఉంటుంది.

హిందూధర్మంతో సామ్యం

భగవంతుడి నిర్దేశానుసారం కన్నబిడ్డను బలి ఇవ్వడానికి సిద్ధపడడం, అది కూడా అల్లాహ్ ద్వారా నిర్దేశించిన ధర్మప్రచారం పనిలోనే ఉన్న ప్రవక్తకే ఇలాంటి పరీక్ష ఎదురుకావడం ఈదుల్ అజ్‌హా పండుగ వెనుక కీలకమైన సంగతి. హిందూధర్మంలో కూడా ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మనందరికీ తెలిసిన భక్త శిరియాళ ఉదంతం ఇలాంటిదే. ఈశ్వరుడు అడిగాడని కొడుకును బలిఇస్తే, ఆ త్యాగానికి ప్రసన్నుడైన శివుడు బిడ్డను తిరిగి బతికించడం ఇందులోని మర్మం. 

స్థూలంగా చూసినప్పుడు- భగవంతుడి ఆదేశాలు పాటించడంలో, భగవంతుడి పట్ల సమర్పణ భావంతో ఉండడంలో ఎలాంటి బంధాలు గుర్తుకు రావనే సందేశం సమానంగా రెండుధర్మాల్లోనూ మనకు కనిపిస్తాయి. 

జంతుబలి కూడా త్యాగమే.. ఎలాగంటే?

ఇవాళంటే జంతుబలి కేవలం ఒక ఆచారాంగా, హింసతో కూడిన ఆచారంగా కనిపిస్తుండవచ్చు. మనుషులు ఆహారాన్ని వెదుక్కుంటూ బతికే ప్రాచీన కాలానికి ‘సంపద’ అంటే పశువులే. పశుపోషణ తొలినాళ్ల ప్రధాన వృత్తి. పశువుల్ని అమ్ముకోవడం జీవనాధారం. ఎవడి దగ్గర ఎక్కువ పశువులు ఉంటే వారు సంపన్నులు. వాళ్లే రాజులు. ఇలాంటి వాతావరణం మనకు హిందూధర్మంలో కూడా కనిపిస్తుంది. 

శ్రీకృష్ణుడు ఆదిగా యాదవసామ్రాజ్యాలు మనకు తెలుసు. కౌరవులుగా మనం చెప్పుకునే ధార్తరాష్ట్రులు ఆవుల మందల కోసమే సాగించిన యుద్ధాలు కూడా మనకు ఉన్నాయి. అలా పశువులే సంపదగా భావించే రోజుల్లో దానిని దేవుడి పేరిట ఖుర్బానీ ఇవ్వడం ఒక రకంగా త్యాగమే. సమర్పణ భావానికి నిదర్శనమే.

బలి ఇచ్చిన జంతువును ఎటూ తినేస్తారు కదా.. అందులో త్యాగం, సమర్పణ ఏముంది? అనే సందేహం రావొచ్చు. అక్కడే ఇస్లాం నిర్దేశించిన విలువలు మనకు కనిపిస్తాయి. బలి ఇచ్చిన జంతువును మూడు భాగాలుగా చేసి.. ఒక భాగాన్ని మాత్రమే తమ సొంత కుటుంబం కోసం ఉంచుకోవాలని ఇస్లాం చెబుతుంది. రెండో భాగాన్ని తమ మిత్రబంధువులకోసం పంచిపెట్టాలి. మూడో భాగాన్ని పేదలకు దానమివ్వాలి. 

గొప్ప జీవన విలువలు ఇవే. యావత్తు సంపదలో మూడింట ఒక భాగం మాత్రమే నువ్వు అనుభవించి, తతిమ్మా రెండు భాగాలు ఇతరులకే పంచేయాలంటే.. మనసు అంగీకరించకపోవచ్చు. అందుకే ఇలాంటి పండుగల పేర ప్రత్యేకమైన ఆచారంగా ఆ పద్ధతిని నిర్దేశించి ఉండవచ్చు. మొదటి భాగం నీ కుటుంబానికి అంటే.. అగ్రప్రాధాన్యం కుటుంబానికి దక్కుతున్నట్టు.

రెండో భాగం మిత్రబంధువులకు అంటే- నీ ఆప్త సన్నిహిత వర్గాలు, నీ ఎరికలో ఉన్నవారందరికీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు. మూడో భాగం- పేదలకు దానం అంటే, గతిలేని వాళ్లు అలమటించి పోకుండా వారిలో సంపన్నుల పట్ల అసంతృప్తి రేగకుండా- నీ చుట్టూ ఉన్న సమాజంలో ఒక సమతుల్య జీవన విధానం సాగిపోవడానికి నిర్దేశించిన పద్ధతిగా కనిపిస్తుంది. 

మాంసమే ప్రధానమైన, బలవర్ధకమైన ఆహారంగా ఉన్న రోజుల్లో పేదలు కనీసం ఎఫ్పుడో ఒకసారి ఇబ్బంది లేకుండా దాన్ని పొందడానికి జరిగిన ఏర్పాటులాగా ఇలాంటి పద్ధతి మనకు కనిపిస్తుంది. కాలక్రమంలో బక్రీద్ పండుగ నాడు ఒక పొట్టేలునో, ఇతర జంతువునో ఖుర్బానీ చేయడం ఆనవాయితీ అయింది. 

ఇబ్రహీం బలిఇవ్వబోయిన కొడుకు ఇస్మాయిల్ స్థానంలో అల్లాహ్ ఉంచిన దుంబా జాతి పొట్టేలు మనదగ్గర అంతగా దొరకదు కాబట్టి ఏదో ఒక జంతువును బలి ఇవ్వడం పద్ధతిగా మారింది. ప్రతి కుటుంబానికీ ఖుర్బానీ చేయగల తాహతు ఉండకపోవచ్చు. పండగ నాడు మాంసం తెచ్చుకుని మనం తినడం మాత్రమే కాదు. పేదలకు కూడా మాంసం దానం చేయాలి. అదే ఇస్లాం నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవనశైలి.

ఇస్లాం ధర్మాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్న అందరికీ ఈద్-ఉల్ అజ్-హా (బక్రీద్) శుభాకాంక్షలు.

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె, 99594 88088