సినిమా చివర్లో వచ్చే రోలింగ్ టైటిల్స్ కోసం ఏం చూపిద్దామనే ఆలోచన మేకర్స్ కు పెద్దగా ఉండదు. ఓ పక్కన మేకింగ్ విజువల్స్ పడేస్తారు, లేదంటే మిగిలిపోయిన పాటను అక్కడ చూపిస్తారు. అంతకుమించి పెద్దగా ఫోకస్ పెట్టరు. కానీ రాజమౌళి మాత్రం దీన్ని కూడా వదలడం లేదు. ఇక్కడ కూడా తన మార్క్ చూపించబోతున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రచార గీతాన్ని రెడీ చేస్తున్నాడు రాజమౌళి. అంటే, సినిమాకు దీనికి సంబంధం ఉండదు. కేవలం ప్రమోషన్ కోసం వాడతారు. తర్వాత సినిమా చివర్లో రోలింగ్ టైటిల్స్ మీద ఈ సాంగ్ వేస్తారు. ఇప్పుడీ పాటను భారీ ఎత్తున షూట్ చేస్తున్నాడు రాజమౌళి.
ఈ సాంగ్ కోసం 2 భారీ సెట్స్ రెడీ చేశాడు. ఒక సెట్ లో షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ పై కొన్ని మాంటేజ్ సీన్స్ తీస్తున్నారు. ఈ సాంగ్ లో హీరోహీరోయిన్లతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ అంతా కనిపిస్తారు. లైట్ బాయ్ నుంచి డైరక్టర్ వరకు ప్రతి ఒక్కర్ని చూపించాలనేది ఆలోచన. అయితే రాజమౌళి ఇక్కడితో ఆగిపోలేదు.
భారీగా తీస్తున్న ఈ ప్రమోషనల్ సాంగ్ లో తన గత చిత్రాల హీరోల్ని కూడా చూపించాలని అనుకుంటున్నాడట రాజమౌళి. ఈ మేరకు ప్రభాస్, రవితేజ లాంటి హీరోలకు ఆల్రెడీ సమాచారం చేరవేశారని తెలుస్తోంది. వీళ్లతో పాటు నితిన్, నాని, సునీల్ కూడా కనిపించబోతున్నారు.
ఇదే కనుక జరిగితే ఆర్ఆర్ఆర్ ప్రచార గీతంలో ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ను ఒకే ఫ్రేమ్ లో చూడొచ్చు. సినిమాకు అది మరో పెద్ద ఎట్రాక్షన్ గా కూడా మారుతుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.