పోలీసుల అత్యుత్సాహం.. జగన్ కు కొత్త తలనొప్పి

రెండు రోజుల క్రితం చలో తాడేపల్లి అంటూ రోడ్లపైకి వచ్చిన టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంటిని చుట్టుముట్టడానికి వస్తున్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు అనుకోవచ్చు. మరి…

రెండు రోజుల క్రితం చలో తాడేపల్లి అంటూ రోడ్లపైకి వచ్చిన టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం ఇంటిని చుట్టుముట్టడానికి వస్తున్నారు కాబట్టి ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు అనుకోవచ్చు. మరి జనసేనతో వచ్చిన నష్టమేంటి. 

జనసేన నేతలు జిల్లాల్లోని ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజీల్లో వినతిపత్రాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ దశలో ముందస్తు అరెస్ట్ లతో జనసైనికుల్ని హీరోలు ఎందుకు చేశారు. అసలు నిరసనకారుల్ని అరెస్ట్ చేసి ఆయా సంఘటనలకు లేనిపోని ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా? ఇదే ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, పోలీసులకు, లాఠీలకు మేం భయపడం.. ప్రతిపక్షాలు రొటీన్ గా చెప్పే డైలాగులే ఇవి. సబ్జెక్ట్ లో బలం లేకపోతే నిరసనలు ఎంతమంది చేసినా, ఎన్నిరకాలుగా చేసినా ప్రజాబలం దానికి తోడుకాదు. అమరావతి ఉద్యమమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. 

చంద్రబాబు జోలె పట్టుకుని చేసిన విన్యాసాలు, ఆయన భార్య రెండు బంగారు గాజుల విరాళాలు.. అందరికీ తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు ఉద్యమం ఎక్కడ, ఉద్యమ నాయకులు ఎక్కడ, బాబు, చినబాబు ఎక్కడ..? అనవసరంగా ఇలాంటి వాటిని పెంచి పోషిస్తేనే ఇబ్బందులు తలెత్తుతాయి. తాజాగా జాబ్ క్యాలెండర్ పేరుతో జరుగుతున్న రగడ కూడా ఇలాంటిదే.

పాత క్యాలెండర్ రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్లతో మరో ప్రకటన ఇవ్వాలనేది టీడీపీ, జనసేన, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాల డిమాండ్. ఎవరికి వారే ఈ విషయంలో హైలెట్ కావడానికి తాపత్రయపడుతున్నారు. రోజు మార్చి రోజు నిరసనలు పెట్టుకుంటున్నారు కానీ, ఉమ్మడి సమస్యపై ఉమ్మడిగా పోరాడటానికి వారికి రాజకీయాలు అడ్డొస్తున్నాయి. 

పోనీ నిజమైన నిరుద్యోగులు రాజకీయ పార్టీల బుట్టలో పడ్డారా అంటే అదీ లేదు. కేవలం రాజకీయ పార్టీల కార్యకర్తలే జాబ్ క్యాలెండర్ పేరుతో రగడ చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడంలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహమే ఇప్పుడు జగన్ కి తిప్పలు తెచ్చేలా ఉంది.

రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, నిరుద్యోగులు రగిలిపోతున్నారు, జాబ్ క్యాలెండర్ ప్రకటనతో ప్రళయం వచ్చేసింది అన్నట్టుగా టీడీపీ బిల్డప్ ఇస్తోంది. సచివాలయాల పోస్ట్ లు ఉద్యోగాలు కాదా, వాలంటీర్లు ప్రజల కోసం పనిచేయడం లేదా, గౌరవ వేతనం తీసుకోవడం లేదా? లక్షలాది ఉద్యోగాలు కళ్లముందు పెట్టుకుని గ్రూప్-1 పడలేదు, డీఎస్సీ వేయలేదు అంటూ రాద్ధాంతం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. కరోనా ఊపు తగ్గడంతో, ఇలా డూపు ఉద్యమాలతో జనం ముందుకొస్తున్నాయి.

అయితే వీటిని పట్టించుకోకపోవడమే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకు వెళ్లడం జగన్ పాలసీ. అయితే ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కొన్నిసార్లు పోలీసులు చేసే ఇలాంటి పనులు చివరకు ప్రభుత్వానికి తిప్పలు తెస్తాయి. అరెస్ట్ లతో ఆఖరికి జనసేన నేతలు కూడా హీరోలుగా మారుతున్నారు. నెలల తరబడి రాష్ట్రానికి మొహం చాటేసిన జనసేనాని కూడా ఈ ఘటనలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై రంకెలేస్తున్నారు.