కేంద్రంపై ఉద్య‌మించే ద‌మ్ముందా?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ విష‌య‌మై త‌న‌ది ఉక్కు సంక‌ల్ప‌మ‌ని మోదీ స‌ర్కార్ మ‌రోసారి చ‌ట్ట స‌భ వేదిక‌గా తేల్చి చెప్పింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ కాకుండా ఏ విధంగా అడ్డుకోవాల‌ని…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ విష‌య‌మై త‌న‌ది ఉక్కు సంక‌ల్ప‌మ‌ని మోదీ స‌ర్కార్ మ‌రోసారి చ‌ట్ట స‌భ వేదిక‌గా తేల్చి చెప్పింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ కాకుండా ఏ విధంగా అడ్డుకోవాల‌ని ఏపీ రాజ‌కీయ పార్టీలు తేల్చుకోవడం ఒక్క‌టే మిగిలి ఉంది. 

విశాఖ స్టీల్ ప్లాంట్ న‌ష్టాల్లో ఉంద‌నే సాకుతో దాన్ని ప్రైవేటీక‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హ‌క్కు అనే సెంటిమెంట్‌గా ఉన్న ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించాల‌నే నిర్ణ‌యంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

కార్మిక సంఘాలు, అన్ని రాజ‌కీయ ప‌క్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్నా కేంద్రం మాత్రం త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోలేదు. అంతేకాదు, ప్రైవేటీక‌ర‌ణ వైపు ముందుకు క‌దులుతోంది. ఈ నేప‌థ్యంలో ప్రైవేటీక‌ర‌ణపై రాజ్య‌స‌భ‌లో టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి భ‌గ‌వ‌త్ కిష‌న్‌రావు క‌రాడ్ స్ప‌ష్ట‌త ఇచ్చారు. 100% ప్రైవేటీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయ పార్టీల స్పంద‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి మౌనంతో ఊ కొడ‌తాయా లేక ఉద్య‌మిస్తాయా? అనేది తెలియాల్సి వుంది. కానీ ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయ పార్టీల వ్య‌వ‌హార శైలి చూస్తుంటే …కేంద్రానికి కోపం తెప్పించేలా ఉద్య‌మిస్తాయ‌నే న‌మ్మ‌కం మాత్రం లేదు. 

రాజ‌కీయ పార్టీల‌న్నీ త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ విష‌య‌మై ఉత్తుత్తి ఉద్య‌మ మాట‌లు చెబుతున్నాయ‌నే అనుమానాలు కార్మికుల్లో ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.