హీరో బాలకృష్ణకు సెంటిమెంట్లు చాలా ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆయన తెల్లవారు ఝామున లేచి చాలా సేపు పూజలు చేస్తారు. మెడలో, చేతులకు, వేళ్లకు రకరకాల సెంటిమెంట్ సంబంధిత ఆభరణాల ధరిస్తారు. లేటెస్ట్ గా ఆయనే తన సెంటిమెంట్ కు సంబంధించి ఓ విషయం వెల్లడించారు. ఆదివారం నాడు నలుపు డ్రెస్ వేయడం గురించి ఆ ముచ్చట.
ఆదిత్య 369 షూటింగ్ సమయంలో బాలయ్యకు ప్రమాదం జరిగింది. ఆ రోజు ఆ ప్రమాదం జరగడానికి కారణం ఆయన నలుపు డ్రెస్ ధరించడమే నంట. అనుకోకుండా ఆదివారం మొత్తం బ్లాక్ డ్రెస్ ధరించాను. అందుకే కొట్టేసింది అంటూ ఆయనే ఓ ఇంటర్వూలో చెప్పుకున్నారు. ఆ తరువాత మళ్లీ అలా చేయలేదట.
ఆదిత్య 369 మ్యాక్స్
ఆదిత్య 369కు తీయబోయే సీక్వెల్ కు ఆదిత్య 369 మ్యాక్స్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు బాలయ్య వెల్లడించారు. తనే కథను ఆశువుగా తయారుచేసానని చెప్పారు. స్క్రిప్ట్ రెడీగా వుందని మోక్షజ్ఞ హీరోగా వుంటాడని 2023లో స్టార్ట్ చేస్తామని చెప్పారు.
సినిమాలో కృష్ణదేవరాయలు పాత్ర మాదిరిగా ఒకటి రెండు గొప్ప పాత్రలు వుంటాయన్నారు. వాటిని తాను చేస్తానని ఆయన అన్యాపదేశంగా వెల్లడించారు. అలాగే ఆదిత్య 369 సీక్వెల్ తనే స్వంతగా నిర్మిస్తానని చెప్పారు.
వరుస సినిమాలు
గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి సినిమాలతో పాటు హారిక హాసిని బ్యానర్ కు కూడా ఓ సినిమా ఓకె చేసానని, అలాగే పూరి డైరక్షన్ లో కూడా ఓ సినిమా వుంటుందని బాలయ్య వెల్లడించారు.
అందరు హీరోలు ఏడాదికి మూడు సినిమాలు చేయాలని అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని బాలయ్య చెప్పారు. అఖండ సినిమా అక్టోబర్ లో విడుదల పక్కా అని ఆయన చెప్పారు.