ఏపీలో డాక్టర్ ఎమ్మెల్యే ఒకామె ఉన్నారు. ఆమె మొన్నటివరకు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఇప్పుడు కాదు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారుగాని వైసీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆమే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. తాడికొండ ఎమ్మెల్యే. ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? అంటే వచ్చే ఎన్నికల్లో ఆమె ఎన్నికల్లో గెలుస్తుందా అని అర్థం. ఆమెను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో తెలుసు కదా. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న ఉద్దేశంతో వైసిపి ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది.
ఆమెతో పాటు మరో ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరించారు. వాళ్ల సంగతి పక్కనబెడితే బహిష్కరణకు గురైన తరువాత శ్రీదేవి టీడీపీ పంచన చేరారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. పార్టీలో చేరడానికి ఆసక్తి చూపారు. ఆమె రాకను చంద్రబాబు స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇస్తాననే హామీ సైతం ఇచ్చారు. బాపట్ల లోక్‌సభ టికెట్‌ను ఆమెకు ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
కాని శ్రీదేవి తాడికొండ లేదా ప్రత్తిపాడు అసెంబ్లీ టికెట్ కోరుకుంటున్నారు. తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మళ్లీ గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినప్పటికీ.. హామీ దక్కలేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌కు ఇప్పటికే టికెట్ ఖరారు కావడంతో శ్రీదేవికి మొండిచెయ్యి చూపించినట్టే. తాడికొండకు ప్రత్యామ్నాయంగా ప్రత్తిపాడు అయినా ఇవ్వాలనేది ఆమె విజ్ఞప్తి. అదీ సాధ్యపడేలా లేదు.
2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్.. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అందుకే తనకు టికెట్ ఇవ్వాలని ఆమె పట్టుబట్టుతున్నారు గానీ సాధ్యపడకపోవచ్చు. ఈ టికెట్‌ను రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రామాంజనేయులుకు ఇస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవికి బాపట్ల లోక్‌సభ బరిలో దింపే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సీటుపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోంది. 2019 ఎన్నికల్లో నందిగం సురేష్.. ఇక్కడి నుంచి ఘన విజయం సాధించారు. సీనియర్ నేత శ్రీరామ్ మాల్యాద్రిని మట్టి కరిపించారాయన.
ప్రస్తుతం శ్రీరామ్ మాల్యాద్రి.. రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు. ఇక్కడ ఏర్పడిన ఈ లోటును ఉండవల్లి శ్రీదేవితో భర్తీ చేయాలనే అభిప్రాయంలో ఉంది టీడీపీ. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. నందిగం సురేష్, ఉండవల్లి శ్రీదేవి మధ్య వ్యక్తిగత విభేదాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగాయి. ఇప్పుడామె టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆమె గెలుపు సాధ్యమవుతుందా? ఎందుకంటే తాను గెలుస్తానన్న అసెంబ్లీ సీటు ఆమెకు ఇవ్వకుండా పార్లమెంటు సీటు ఆఫర్ చేస్తున్నారు చంద్రబాబు. అక్కడ శ్రీదేవి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలుపు సులభమవుతందా అనేది ప్రశ్న.
తాను ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేను కాబట్టే.. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఇక్కడే ఉండవల్లి శ్రీదేవి లాజిక్ మిస్ అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో.. ముగ్గురు జగన్ సామాజికవర్గానికి చెందిన వారే. కేవలం ఉండవల్లి శ్రీదేవి మాత్రమే ఎస్సీ ఎమ్మెల్యే. నిజానికి శ్రీదేవి చెప్పినట్టు ఎస్సీ ఎమ్మెల్యే అని సస్పెండ్ చేస్తే.. మరి కోటంరెడ్డి, ఆనం, మేకపాటిని ఎందుకు సస్పెండ్ చేస్తారు.. వారు రెడ్డి సామాజికవర్గం కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు.. అని ఉండవల్లి శ్రీదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి.. అమరావతిపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు వైసీపీలో ఉండగా ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తున్నారు. తనకు ఏదో జరిగిందని.. ఇప్పుడు అమరావతి కోసం మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె వైసీపీలో ఉండగా ఇదే మాట చెబితే.. నెత్తిన పెట్టుకునే వాళ్లమని అంటున్నారు.
ఇక క్రాస్ ఓటింగ్ విషయానికొస్తే.. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. అయితే.. నిజంగా ఆమె క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకపోతే.. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాలి కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకపోతే.. జగన్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పొచ్చు కదా అనే వ్యాఖ్యాన్యాలు వస్తున్నాయి. మొత్తంమీద శ్రీదేవి అడిగిన అసెంబ్లీ సీటు ఇవ్వకుండా చంద్రకబాబు ఆమె రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడతారా?