లెక్కప్రకారం రేపట్నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ లో ప్రజాదర్బార్ లాంఛనంగా ప్రారంభం అవ్వాలి. కానీ ఆ కార్యక్రమాన్ని వాయిదావేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్ట్ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు కార్యక్రమం వాయిదాడిన విషయాన్ని మంత్రి కన్నబాబు అధికారికంగా ప్రకటించారు.
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం జగన్, ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజాదర్బార్ నిర్వహించాలనుకున్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ పని చేయాలని భావించారు. కానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తే, సమయాభావం వల్ల మధ్యమధ్యలో విరామం ఇవ్వాల్సి రావొచ్చు. అలా చేయడం ముఖ్యమంత్రికి ఇష్టంలేదు. అందుకే ప్రజాదర్బార్ ను నెల రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు.
ప్రజాదర్బార్ కు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులు మాత్రం చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ పనుల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత తిరిగి ప్రారంభమౌతాయి.
ఈసారి ప్రజాదర్బార్ ను వినూత్నంగా నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. వినతిపత్రాలు తీసుకోవడం, అక్కడికక్కడే సమీక్షించడం, పరిష్కారాలు సూచించడం లాంటి వాటితో పాటు… వచ్చిన సమస్యలన్నింటినీ డిజిటల్ రూపంలోకి మార్చబోతున్నారు. అంటే, ప్రజాదర్బార్ ను కేవలం గంట నిడివికి మాత్రమే పరిమితం చేయకుండా.. రోజులో తనకు సమయం చిక్కిన ప్రతిసారి ఈ సమస్యలపై వ్యక్తిగతంగా దృష్టిపెడతారు జగన్. ఆ విధంగా ఓ మెకానిజమ్ తయారుచేయమని అధికారులను కోరారు.