ఆంధ్రప్రదేశ్‌లో 'ఆపరేషన్ కమలం' దెబ్బకి తెలుగుదేశం పార్టీ విలవిల్లాడుతోన్న విషయం విదితమే. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి, బీజేపీలో చేరిపోయారు. అయితే, ఇదంతా చంద్రబాబు వ్యూహంలో భాగంగానే జరిగిందన్న అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే వున్నాయి. మరోపక్క, రాజ్యసభ సభ్యులతో సరిపెట్టబోమనీ.. లోక్‌సభ సభ్యులు, శాసన సభ్యులు కూడా బీజేపీ వైపు వచ్చేస్తారని భారతీయ జనతా పార్టీ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలన్నది బీజేపీ ప్లాన్.. ఆ దిశగానే ఆ పార్టీ పావులు కదుపుతోంది.
ఇక, తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు రేపో మాపో బీజేపీలో చేరిపోతారన్న ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు ఎంపీ రామ్మోహన్‌నాయుడు కాగా, మరొకరు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. రామ్మోహన్‌నాయుడుతోపాటు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా బీజేపీలోకి వెళతారన్న ప్రచారం గతంలో జరిగినా, అచ్చెన్నాయుడు విషయంలో బీజేపీ ఏమంత సానుకూలంగా స్పందించడంలేదన్నది బీజేపీ నుంచి అందుతోన్న తాజా లీకుల సారాంశం.
ఇదిలా వుంటే, దివంగత ఎర్రన్నాయుడి కుమార్తె భవానీ, రాజమండ్రి నుంచి అసెంబ్లీకి ఎంపికైన విషయం విదితమే. ఆమె కూడా టీడీపీకి టాటా చెప్పేయనున్నారట. రామ్మోహన్‌నాయుడు, భవానీ విషయంలో సానుకూలంగా వున్న బీజేపీ, అచ్చెన్నాయుడు విషయంలో ఎందుకు ఆసక్తి చూపడంలేదన్న విషయం శ్రీకాకుళం జిల్లా వాసుల్ని విస్మయానికి గురిచేస్తోంది.
కాగా, వైసీపీ నుంచి కూడా ఒకరిద్దరు నేతల్ని లాగేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. 'బీజేపీ – వైసీపీ ఒక్కటే..' అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం నేపథ్యంలో, తమ 'ఆపరేషన్ కమలం'లో భాగంగా చిన్న నేతలే అయినా ఒకరిద్దరు వైసీపీ నేతల్ని లాగాలన్నది బీజేపీ ఆలోచనగా కన్పిస్తోంది. కానీ, అలా వైసీపీని వీడి, బీజేపీలో చేరేందుకు ఏ ఒక్కరైనా సుముఖత వ్యక్తం చేస్తారా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.