ఎలుకలు పట్టడానికి లక్షలు ఖర్చు చేశారు.. మంచి నీళ్ళ ప్యాకెట్ల పేరుతో అడ్డంగా దోచేశారు.. గడచిన ఐదేళ్ళలో రాష్ట్రం ఏ స్థాయిలో దోపిడీకి గురయ్యిందో ప్రజలకు చెప్పకపోతే ఎలా.?
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల సారాంశమిది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల నేపథ్యంలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 30 అతి ముఖ్యమైన అంశాలపై నిజాలు నిగ్గు తేల్చేందుకోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటయిన విషయం విదితమే. ఎవరెవరు ఏయే అంశాల్ని ఎంతెంత లోతుగా విశ్లేషించాల్సిందీ ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ ఉపసంఘానికి స్పష్టంగా దిశా నిర్దేశం చేశారు.
'అత్యంత ఎక్కువగా అవినీతి నీటి ప్రాజెక్టుల విషయంలో జరిగింది. సింగిల్ హ్యాండెడ్ టెండర్లుకే అడ్డగోలుగా పనులు అప్పగించేయడం అత్యంత దారుణమైన విషయం..' అంటూ మంత్రి వర్గ ఉప సంఘం తొలి భేటీ అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకొచ్చారు. కేవలం 45 రోజుల్లోనే మంత్రి వర్గ ఉప సంఘం తమకు అప్పగించిన పనిని పూర్తి చేసెయ్యనుందట.
'ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత ఏర్పడ్డ పసిగుడ్డు అయిన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ని అడ్డగోలుగా దోచేశారు.. ఆ దోపిడీ అంతు తేల్చడం మా బాధ్యత. ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. పుష్కరాల పేరుతో దోచేశారు.. ప్రాజెక్టుల పేరుతో పండగ చేసుకున్నారు.. రహస్య జీవులతో జేబులు నింపుకున్నారు.. అన్నిటినీ రాబట్టి తీరతాం..' అని పలువురు మంత్రులు స్పష్టం చేశారు.
చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చుతామంటూ ముఖ్యమంత్రి అవుతూనే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తేల్చి చెప్పిన విషయం విదితమే. 'అసలు అది సాధ్యమయ్యే పనేనా.?' అంతా ముక్కున వేలేసుకుంటున్న తరుణంలో, అత్యంత వేగంగా ఆ ప్రక్రియను ప్రారంభించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ముందు ముందు ఇంకెలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతోందోగానీ.. 'చంద్రబాబు జైలుకు వెళ్ళక తప్పదా.?' అన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది.
షరామామూలుగానే తెలుగుదేశం పార్టీ నేతలు.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ గగ్గోలు పెట్టడం షురూ చేసేశారు. తమది అత్యంత నీతివంతమైన ప్రభుత్వమనీ.. అవినీతి అన్నదే ఎక్కడా కన్పించదనీ.. తెలుగు తమ్ముళ్ళు మీడియాకెక్కి బుకాయిస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.