పచ్చ నీచత్వం ఎలా ఉంటుందంటే..?

రాష్ట్రంలో ఏ చిన్న క్రైం జరిగినా సరే.. దాన్ని రాజకీయాలకు ఎలా ముడిపెట్టాలి.. దాని ద్వారా రాజకీయ లబ్ధి ఎలా పొందాలి.. జగన్మోహన్ రెడ్డి సర్కారును ఎలా బద్నాం చేయాలి అని ఆలోచించడం తెలుగుదేశం…

రాష్ట్రంలో ఏ చిన్న క్రైం జరిగినా సరే.. దాన్ని రాజకీయాలకు ఎలా ముడిపెట్టాలి.. దాని ద్వారా రాజకీయ లబ్ధి ఎలా పొందాలి.. జగన్మోహన్ రెడ్డి సర్కారును ఎలా బద్నాం చేయాలి అని ఆలోచించడం తెలుగుదేశం శ్రేణులకు అలవాటే!

సదరు నేరంలో బాధితపక్షం తెలుగుదేశానికి చెందిన వారు అయితే ఇక చెప్పవలసిన అవసరమే లేదు.. మన్నూమిన్నూ ఏకం చేసేస్తూ గగ్గోలు పెడతారు. తాజాగా కూడా అలాంటి ప్రయత్నంతోనే అభాసుపాలయ్యారు.

ఓ జంట హత్యలను రాజకీయ ప్రేరేపిత హత్యలుగా మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నించిన తెలుగుదేశం నాయకులకు షాక్ ఇచ్చేలా.. హత్య కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించడం విశేషం.

నెల్లూరులో నాలుగురోజుల కిందట జంట హత్యలు జరిగాయి. హోటల్ నిర్వహిస్తున్న కృష్ణారావు, ఆయన భార్య వాసిరెడ్డి సునీతలు ఇంట్లో నిద్రిస్తుండగా హత్యకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు ఇంట్లో దూరి వారిని చంపేసినట్టు గుర్తించారు. 

ఆ ఘటన జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు రెచ్చిపోయారు. వైసీపీ నాయకులే ఈ హత్య చేయించారు అనే మాట అనలేదు గానీ.. వాసిరెడ్డి సునీత తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అని, ఈ హత్యల వెనుక ఆ కోణంలో కూడా పరిశీలించాల్సి ఉన్నదని.. ఇవి రాజకీయ హత్యలు అయినట్లుగా.. ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న తెలుగుదేశం అనుకూల ప్రచారానికి కోపగించుకున్న వారే హత్య చేసి ఉంటారన్నట్టుగా ప్రజల్ని నమ్మించడానికి మాట్లాడారు. 

అయితే నెల్లూరు పోలీసులు నాలుగురోజుల్లోనే హత్య కేసును ఛేదించారు. కృష్ణారావు నిర్వహిస్తున్న హోటల్ లో పనిచేస్తున్న సర్వర్ శివతో కలిసి, వారి బంధువు రామకృష్ణ ఈ హత్య చేసినట్టు గుర్తించి అరెస్టు చేశారు. 

అయితే ఈ వ్యవహారంలో హత్య జరిగీ జరిగిన వెంటనే.. ఏ సంగతీ అంచనాకు రాక ముందే.. ఇది రాజకీయ హత్యగా అనుమానాలు పుట్టించడానికి, వైసీపీ మీద నిందలు వేయడానికి తెలుగుదేశం దళాలు ప్రయత్నించడం దారుణం.

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే పార్టీల కార్యకర్తల్ని చంపేసేట్లయితే.. రాష్ట్రంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉండాలి. సోషల్ మీడియా పోస్టుల్లో కూడా శృతిమించినవి, హద్దూ అదుపూ లేని వాటి విషయంలో మాత్రమే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు తప్ప.. వారి మీద ఎలాంటి వ్యక్తిగత దాడులు జరగడం లేదు.

అయితే ఈ హత్యల విషయంలో ఒక దుర్మార్గపు ప్రచారానికి ప్రయత్నించిన తెలుగుదేశం నాలిక్కరుచుకుని సైలెంట్ అయిపోయింది. ఏ నేరం జరిగినా సరే.. దాన్ని రాజకీయాలకు ముడిపెట్టే పచ్చ దుర్బుద్ధులు మాత్రం బయటపడ్డాయి.