లైగర్ సినిమా బాక్సాపీస్ వద్ద దారుణంగా దెబ్బతినిపోయింది. ఇటీవలి కాలంలో ఎవ్వరూ ఎరగనంత చారిత్రాత్మక ఫ్లాప్ అది.
పూరి- విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనగానే.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, విడుదలయ్యాక సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ నిరాశకు గురిచేసింది.
నెటిజన్లు పాన్ ఇండియా డిజాస్టర్ గా ముద్ర వేసి సోషల్ మీడియాలో పెద్దపెట్టున ఆ సినిమా పరువు తీశారు. అయితే.. సినిమా డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన వరంగల్ శీను మాత్రం ఈ సినిమాను వెన్నుపోటు పొడిచారని అంటున్నారు.
ఓ ఇంగ్లిషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.
సినిమా పరిశ్రమ ప్రస్తుతం చాలా చెడ్డ దశలో ఉన్నదని చెప్పిన ఆయన, కొందరు నటుల్ని, డైరక్టర్లని బ్యాన్ చేయడానికి జరుగుతున్న కుట్రల వల్ల.. పరిశ్రమలోని వేలాదిమంది కార్మికుల కుటుంబాలు కూడా నష్టపోతున్నాయని చెప్పుకొచ్చారు. నటులు, దర్శకుల మీద వ్యక్తిగత కక్షలతో జరిగే ఇలాంటి ప్రచారాల వల్ల సినిమాలు తగ్గుతాయని, అంతిమంగా సినిమా పరిశ్రమ మీద ఆధారపడిన పేద కార్మికుల కుటుంబాలే భుక్తిని కోల్పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు (లైగర్ సినిమాక) వ్యతిరేకంగా, దాదాపుగా ప్రతిరోజూ ఒక కల్పిత ప్రచారం జరిగింది. ఇది అవాంఛనీయమైనది. మీరు సినిమా చూడండి.. అది మీకు నచ్చకపోతే తిప్పికొట్టండి.. అయితే, సినిమా విడుదల కావడానికి ముందే, ఆ సినిమాను మీరు చూడకుండానే.. దాన్ని గురించి ఎలా దుష్ప్రచారం చేస్తారు.. అని శీను ప్రశ్నించారు.
గత ఒక్క ఏడాదిలోనే తాను వందకోట్లకు పైగా నష్టపోయినట్టు వస్తున్న వార్తలను కూడా డిస్ట్రిబ్యూటర్ శీను ఖండించారు. చాలా నష్టపోయిన మాట నిజమే కానీ, వందకోట్లు కాదు అని ఆయన వెల్లడించారు.
లైగర్ విషయానికి వస్తే తన పెట్టుబడిలో 65 శాతానికి పైగా కోల్పోయినట్టు చెప్పారు. సినిమా నాకు నచ్చింది, కానీ, చివర్లో 7-10 నిమిషాల క్లయిమాక్స్ బాగాలేదు.. ఉండవలసినంతగా లేదు.. అని శీను చెప్పడం విశేషం.
డిస్ట్రిబ్యూటర్ శీను తనకు వచ్చిన నష్టాల గురించి ఇలా నిజాయితీగా వెల్లడించడం అంతా బాగానే ఉంది. కానీ సినిమాని వెనకేసుకు రావడమే కామెడీగా ఉంది.
కేవలం సోషల్ మీడియాలో ఒక కల్పితప్రచారమే వెన్నుపోటు పొడిచేసిందంటే ప్రజలు ఎలా నమ్ముతారు? విడుదలకాక ముందునుంచే జరిగిన దుష్ప్రచారం సంగతి ఓకే.. కానీ ఒకసారి సినిమా విడుదల అయ్యాక.. అందులో సత్తా ఉంటే.. ఏ ప్రచారాలనూ ప్రేక్షకులు పట్టించుకోరు. అది దూసుకెళ్లిపోతుంది.
కేవలం ఒక నెగటివ్ ప్రచారం మీద నెపం నెట్టేసి, సినిమా పరిశ్రమలో ఉండే కుట్రలను దానికి ముడిపెట్టేసి, వెన్నుపోటు అనేస్తే సరిపోతుందా? ఇదెలా ఉన్నదంటే.. దేశవ్యాప్తంగా సినిమాను చూసిన కోట్ల మంది ప్రేక్షకులు యావత్తూ.. టాలీవుడ్ లోని కుట్రలలో భాగస్వామిగా మారినట్లుగా డిస్ట్రిబ్యూటర్ శీను అభివర్ణిస్తున్నట్లుంది.