దేశంలో ఉన్న భాజపా వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్క తాటిమీదకు తెచ్చి.. మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాకుండా చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. మోడీతో కాస్త విభేదించే ప్రతి నాయకుడినీ వ్యక్తిగతంగా కలుస్తున్నారు. వారందరినీ కూడగట్టుకోడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీహార్ కూడా వెళ్లారు. బిజెపికి కటీఫ్ చెప్పేసి, ఆర్జేడీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన నితీశ్ కుమార్ తో భేటీ అయ్యారు. మోడీ వ్యతిరేక ప్రభుత్వం రావాల్సిన అవసరం గురించి తన అభిప్రాయాలన్నీ తర్వాత ప్రెస్ మీట్ లో యధావిధిగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తమ తమ రాష్ట్రాల్లో కూడా దర్యాప్తులు కొనసాగించడానికి వీలుగా ఇచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్రప్రభుత్వాలూ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ పిలుపు ఇవ్వడం విశేషం. పోలీసింగ్ అనేది రాష్ట్రాల పరిధిలోని వ్యవహారం అని, ఈ విషయంలో కేంద్ర జోక్యాన్ని తోసిరాజనేందుకు సిబిఐ అడుగుపెట్టకుండా తమ సమ్మతిని రాష్ట్రాలు ఉపసంహరించాలనేది ఆయన ఉద్దేశం. బిహార్ లో ప్రస్తుతం రాజ్యం చేస్తున్న మహాకూటమి నేతలు కూడా ఇదే డిమాండ్ ను వినిపిస్తున్నారు. అదే వేదిక మీద కేసీఆర్ ఈ పిలుపు ఇచ్చారు.
సిబిఐ దర్యాప్తులను తోసిరాజంటూ.. వారికి ఇచ్చిన సమ్మతిని చంద్రబాబునాయుడు గతంలో తాను సీఎంగా ఉండగా ఉపసంహరించుకున్నారు. 2014లో సీఎం అయిన తర్వాత.. చాలాకాలం పాటు బిజెపితో చెట్టపట్టాలు వేసుకుని నడిచిన చంద్రబాబునాయుడు.. ఒకసారి వారి కూటమినుంచి బయటకు వచ్చిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ నాయకులపై సిబిఐ దాడులు జరిగాయి.
తర్వాత కొన్నాళ్లకే చంద్రబాబు వారికి ఏపీలో సమ్మతిని నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం.. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నదనే ఆరోపణలు చేశారు. బహుశా ఇప్పుడైతే కేంద్రం తనవైపు చల్లనిచూపులు చూడాలని కోరుకుంటున్న చంద్రబాబు ఆ మాట అనరేమో.
ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు బాటను అనుసరిస్తున్నారు. గతంలో ఆయన చేసిన పనినే ఇప్పుడు తామందరమూ చేయాలని అంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలకు పిలుపు ఇస్తున్నారు. ప్రస్తుతానికి పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్, రాజస్తాన్, పంజాబ్, మేఘాల సహా తొమ్మిది రాష్ట్రాలు సిబిఐకు సమ్మతి నిరాకరించాయి. కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో తెలంగాణ, బీహార్ కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియదు గానీ.. కేసీఆర్ మాటలు ప్రజల్లో ఇంకో భయాన్ని కూడా పుట్టిస్తున్నాయి. పోలీసింగ్ అనేది పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోని వ్యవహారం అని కేసీఆర్ అంటున్నారు. అది కూడా గొప్ప సంకేతమేమీ కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుయంత్రాంగాన్ని తమ రాజకీయ ప్రత్యర్థుల భరతం పట్టడానికి వాడుతున్నాయనే ఆరోపణలు కూడా పుష్కలంగానే ఉన్నాయి కదా.. మరి ఈ సమస్యకు విరుగుడు ఎప్పటికి? ఎలా? అనేదే సామాన్యుడి మదిలో మెదలుతున్న సందేహం.