కుప్పం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పులివెందులలో అంతా బాగే అనుకుంటే మాత్రం… భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే పులివెందులలో వైఎస్ జగన్ తీరుపై ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు సంతృప్తిగా లేరు.
అధికారంలో ఉన్నప్పటికీ తమ బతుకులు ఏ మాత్రం మారలేదనే అసంతృప్తి, ఆగ్రహం పులివెందుల వైసీపీలో గూడు కట్టు కుంది. ఇది చేదు నిజం. ఇప్పుడు అధికారంలో వుండడం వల్ల వైసీపీ బండి సాఫీగా దొర్లుతున్నట్టు కనిపిస్తోంది. అధికారం పోతే… ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఇబ్బందులే భవిష్యత్‌లో పులివెందులలో జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందనేది వాస్తవం. కుప్పం వేరు, పులివెందుల వేరని వైసీపీ నేతలు భావిస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి వుండదు. కేవలం అధికారం మాత్రమే వేరు.
కుప్పం ప్రజానీకంలో అమాయకత్వం వుంటుంది. కానీ పులివెందుల చైతన్యానికి ప్రతీక. ఇప్పుడు జగన్‌పై ఆదరణ… తండ్రి వైఎస్సార్ పుణ్యమే అని చెప్పక తప్పదు.
గతంలో చంద్రబాబు అధికారంలో వున్నప్పటికీ పులివెందులను చూసీచూడనట్టు వ్యవహరించారు. కానీ ప్రస్తుత అధికార పార్టీ తన నియోజకవర్గాన్ని టార్గెట్ చేయడంతో చంద్రబాబు రగిలిపోతున్నారు. భవిష్యత్‌లో అధికారం ఏ మాత్రం మారినా చంద్రబాబు గతంలో మాదిరిగా చూసీచూడనట్టు వ్యవహరిస్తారని అనుకోలేం. ఎందుకంటే కుప్పాన్ని టార్గెట్ చేసే క్రమంలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. రేపు ఇదే మార్గాన్ని టీడీపీ కూడా అనుసరించకుండా వుంటుందా?
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ అంతరంగాన్ని ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ మంత్రి వివేకా అన్నీ తానై చూసుకునే వారు. నియోజకవర్గంలో తమ అనుచరులకు ఏ అవసరం వచ్చినా వివేకా దగ్గరుండి తీర్చేవారు. పులివెందుల వాసులు వైఎస్ రాజశేఖరరెడ్డిని కలవాలంటే సులువుగా వుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎంత మాత్రం లేదు.
తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో పులివెందుల వైసీపీ కార్యకర్తలున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని జగన్ నమ్ముకున్నారు. కానీ ఆయనేమో తెల్లవారుజామున ఐదు గంటలకే ఇంటి నుంచి వెళ్లిపోతారు. లేదంటే ఎక్కువగా హైదరాబాద్‌లో వుంటారని పులివెందుల ప్రజలు చెబుతున్నారు. ఒకవేళ అవినాష్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించినా… సమస్యలను వ్యక్తిగతంగా చెప్పుకునే పరిస్థితి వుండదు. చుట్టూ జనం గుమికూడి వుంటారని అంటున్నారు. గతంలో వైఎస్సార్, వివేకా ఇలా వ్యవహరించేవారు కాదని వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసేవారని, ఇప్పుడా వాతావరణం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి కూడా పులివెందుల వ్యవహారాలను చూస్తుంటారు. సమస్యను పరిష్కరించకుండా నాన్చుతూ కాలయాపన చేస్తారని వైఎస్ భాస్కర్‌రెడ్డిపై ప్రధాన అభియోగం. ఇక జగన్‌ను కలవడం పులివెందుల ప్రజలకు తీరని కలగా మిగిలింది. జగన్‌ను కలిసే దిక్కు తమకే లేదని పులివెందులలో ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. వైఎస్ అవినాష్‌రెడ్డిని కాదని జగన్‌ను కలవడం అసాధ్యం. అవినాష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సీఎంను కలవడానికి పులివెందుల వాసులకు సీఎంఓ అనుమతి ఇస్తుంది. లేదంటే లేదు.
పులివెందుల వైసీపీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా వుందనేది వాస్తవం. అలాగని ఇప్పటికిప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా ఏదో జరిగిపోతుందంటే … అదేం లేదు. కానీ రోజూ ఇదే అభిమానించే మనసు వుంటుందని ఎలా చెప్పగలం? ప్రేమ, అభిమానాలు స్థిరంగా వుండవు. అటువైపు నుంచి తమకు కొంతైనా దక్కితే, ఇటు వైపు వాళ్లలో కూడా అవి వుంటాయి. తమకు అవమానం జరుగుతుందని భావిస్తే మాత్రం… ప్రత్యామ్నాయం వైపు ఆలోచించకుండా ఉండరు. పులివెందులలో ఆ పరిస్థితి జగన్ తెచ్చుకోరని ఆశిద్దాం. కనీసం కుప్పంలో చంద్రబాబు పరిస్థితి చూసిన తర్వాతైనా… తాను మారుతారని పులివెందుల వాసులు గంపెడు ఆశతో ఉన్నారు.