2024లో జరిగే ఎన్నికలు టీడీపీ భవిష్యత్‌ను తేల్చేవి. దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని అధికార భయం వెంటాడుతోంది. చంద్రబాబు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, మనసులో మాత్రం ఏమవుతుందోనన్న ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. మహానాడు విజయవంతమైన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే వైసీపీ ప్లీనరీ అంతకు డబుల్ విజయవంతం కావడమే.
ముఖ్యంగా టీడీపీ నిర్వహించే బాదుడే బాదుడుకు జనం వెల్లువెత్తడంతో ఇక తమదే అధికారం అనే ధీమా కనిపించింది. ఆ ధైర్యం చంద్రబాబును కొన్ని రోజులు ముందుకు నడిపించింది. అంత వరకూ జనసేనతో పొత్తు కోసం వెంపర్లాడిన చంద్రబాబు… తమ కార్యక్రమాలకు జనం రావడం చూసి మనసు మార్చుకున్నారు. పొత్తు వద్దనుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆయన మనసు పొత్తులపై మళ్లింది.
ఇటీవల టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా ఏమీ లేవు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్, అలాగే ఢిల్లీలో మోదీతో కరచాలనం తదితర అంశాలపై మాత్రం టీడీపీ గొప్పలు చెప్పుకుంటోంది. దీంతో మరోసారి జనంతో టీడీపీకి కనెక్టివిటీ తగ్గింది. తాజాగా బీజేపీతో టీడీపీకి పొత్తు వుంటుందనే సంకేతాల్ని బలంగా పంపేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకు ఎల్లో మీడియాను వాడుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో విశ్వసనీయత కోల్పోయిన మీడియా… జాతీయ మీడియా కథనాలంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ పొత్తు ప్రచారంతో బీజేపీకి మరింత అలుసైంది. తాము లేనిదే అధికారంలోకి రాలేమని టీడీపీ భయపడుతోందని బీజేపీ పసిగట్టింది. దీంతో టీడీపీతో బీజేపీ మైండ్ గేమ్ ఆడడానికే సిద్ధమైంది.
తద్వారా టీడీపీని నైతికంగా మరింత బలహీనం చేసేందుకు బీజేపీ వ్యూహం రచిస్తోంది. టీడీపీ పతనమైతేనే తమకు భవిష్యత్ వుంటుందనేది బీజేపీకి బాగా తెలుసు. ఏపీలో టీడీపీ బలంగా ఉన్నంత వరకూ తాము ఎదగలేమని బీజేపీకి తెలుసు. అందుకే తాత్కాలిక ప్రయోజనాల్ని పక్కన పెట్టి, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, వైసీపీలకు దూరంగా వుండాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు ప్రచారం వల్ల తమకు వాటిల్లుతున్న నష్టాన్ని టీడీపీ గ్రహిస్తున్నదా? లేదా? అనేది ప్రధాన చర్చ.
టీడీపీ అత్యుత్సాహం వల్ల… పరోక్షంగా ఆ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. బీజేపీ-జనసేనతో కలిసి పోటీ చేయకపోతే టీడీపీ బతుకు బస్టాండే అనే ప్రచారం క్రమంగా పెరుగుతోంది. ఈ ప్రచారం పరోక్షంగా వైసీపీకి లాభం కలిగిస్తోంది. మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని టీడీపీనే పరోక్షంగా ప్రచారం చేస్తున్నట్టైంది.
జగన్ ప్రభుత్వ పాలనా విధానాలపై ఎన్ని విమర్శలున్నా… సంక్షేమ పథకాల పుణ్యమా అని బడుగు బలహీన, మధ్యతరగతి వర్గాల్లో వైసీపీ బలంగా ఉందనే ప్రచారం పెరుగుతోంది. ముఖ్యంగా ఈ వర్గాలు ఓటింగ్‌కు వచ్చేది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే వారెవరూ ఓట్లు వేయడానికి రారని చెబుతున్నారు.
పవన్‌కల్యాణ్ పదేపదే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని చెప్పడం వల్ల …ఒకవేళ చీలితే ఎవరికి లాభం? మళ్లీ జగనే సీఎం అవుతారా? అని వైసీపీ ప్రత్యర్థులే సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
పవన్ అజ్ఞానం, చంద్రబాబు భయం వెరసి అంతిమంగా జగన్‌కు రాజకీయంగా ప్రయోజనం కలిగించే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాజకీయాలెప్పుడూ ఊహించినట్టు జరగవు. రాజకీయాల్లో చంద్రబాబు ఆరితేరిన నాయకుడు. జగన్ వ్యూహాల ముందు బాబు తేలిపోతున్నారు. అలాగని బాబును తీసిపడేయ లేం. కానీ పవన్ బలహీనతలు బాబుకు బాగా తెలుసు. ఒన్‌సైడ్ అని ఒక్కసారి అంటేనే… తమ వెంట పవన్ పడుతున్నాడని బాబు గ్రహించారు. అప్పటి నుంచి పవన్‌ను బాబు లైట్ తీసుకున్నారు. అలా తీసుకోకపోతే పవన్ డిమాండ్లను తీర్చడం తన వల్ల కాదని చంద్రబాబుకు తెలుసు.
జగన్‌ను గద్దె దించడం తనకంటే పవనే ఎక్కువ బాధ్యత తీసుకునేలా బాబు చేయగలిగారు. అయితే ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయడంలో జగన్ దిట్ట. బాబు దత్త పుత్రుడని పదేపదే అంటూ వాళ్లిద్దరూ వేర్వేరు కాదని జగన్ బలమైన సందేశాన్ని పంపగలిగారు. అందుకు తగ్గట్టే మరీ ముఖ్యంగా పవన్ ప్రవర్తిస్తున్నారు. ఇది టీడీపీ, జనసేనలకు నష్టం తెస్తోంది.
పవన్, చంద్రబాబు అన్నీ మాట్లాడుకుంటే… క్షేత్రస్థాయిలో సాఫీగా సాగిపోదు. ఎవరి స్థాయిలో వారు సొంత ప్రయోజనాలను చూసుకుంటారు. కొంత కాలంగా టీడీపీలో పొత్తులపై మారిన వైఖరి, పవన్ ఓట్లు చీలనివ్వననే అమాయక, అజ్ఞాన ప్రకటనల వల్ల ప్రతిపక్షాలు జగన్‌ను ఎదుర్కోలేకపోతున్నాయనే భావన పెరుగుతోంది. దీని వల్ల జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయాలని తలచిన వర్గాలు కూడా మనకెందుకులే అని సర్దుకుంటున్నాయి.