పవన్ కల్యాణ్ కి సీజనల్ పొలిటీషియన్ అనే పేరుంది. హైదరాబాద్ లో సినిమాలతో బిజీగా ఉండే పవన్ కల్యాణ్.. సరిగ్గా పొలిటికల్ సీజన్ మొదలు కాగానే తెరపైకి వస్తారని, ఇలా కనపడి అలా వెళ్లిపోతారనే ఆరోపణలున్నాయి. ఆరోపణలు కాదు అవి అక్షర సత్యాలు.
సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నానని చెప్పుకునే పవన్, సినిమాలతో బిజీగా ఉంటూ.. అప్పుడప్పుడూ అవసరం మేరకు రాజకీయ తెరపైకి వస్తుంటారు. అందుకే సీజనల్ పొలిటీషియన్ అయ్యారు. ఇక ఆయన అన్నయ్య నాగబాబు గురించి చెప్పుకోవాలంటే, ఆయన అంతకు మించిన సీజనల్. కేవలం ఎన్నికల టైమ్ కే రాజకీయాల వైపు వస్తారు.
పవన్ కల్యాణ్ ఎప్పుడొస్తారో కనీసం ముందుగా హింట్ ఇస్తారు, కానీ నాగబాబు రాకపై మాత్రం సమాచారం ఉండదు, ఆయన రాక గాలిదుమారం లాంటిది. ఎప్పుడొస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్తుందో తెలీదు. ఇలా వచ్చి అలా వెళ్తారు. మళ్లీ ఎప్పుడో మొహం చూపిస్తారు. 2019 ఎన్నికల్లో ఉత్సాహంగా తిరిగిన నాగబాబు.. ఆ తర్వాత పార్టీకి పూర్తిగా దూరమయ్యారు.
గతంలో ఓ ట్వీట్ విషయంలో తమ్ముడు కోప్పడటంతో అలిగి అసలు ఏ కార్యక్రమానికీ రాకుండా ఉండిపోయారు. మళ్లీ ఇటీవల లాల్చీ పైజమా వేసుకుని, గడ్డం పెంచుకుని మేథావిలా అక్కడక్కడా సభల్లో కనపడుతున్నారు, తమ్ముడు పక్కన కూర్చుంటున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో యాత్ర అంటూ హడావిడి మొదలు పెట్టారు నాగబాబు.
జూన్ 1 నుంచి నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నట్టు షెడ్యూల్ విడుదల చేసింది జనసేన పార్టీ. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాగబాబు పర్యటిస్తారట. కీలక నాయకులతో ఆయన సమావేశం అవుతారట, స్థానిక నాయకులకు అందుబాటులో ఉంటారట. ఇదీ ఆ ప్రకటన సారాంశం.
ఆమధ్య నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన అంటూ సోషల్ మీడియాలో వార్తలు రాగా.. వాటిని స్వయంగా ఆయనే ఖండించారు. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. అంతోటి దానికి ఆయన ఖండించడం ఎందుకు, మళ్లీ పర్యటించడం దేనికి.
నాగబాబు వల్ల ఉపయోగం ఏంటి..?
పవన్ కల్యాణ్ పర్యటనలనే ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇక నాగబాబు వస్తే పరిస్థితి ఏంటి..? ఒకవేళ నాగబాబు తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం వేటలో ఏమైనా ఉన్నారా..? పనిలో పనిగా తమ్ముడికి కూడా ఓ నియోజకవర్గం వెదకాలనుకుంటున్నారా? మొత్తమ్మీద నాగబాబు పర్యటనతో ఉత్తరాంధ్ర జనసైనికులు హడలిపోతున్నారు.
ఎన్నికలకు ముందు నేతలు తమ తమ నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం, పలుకుబడి పెంచుకోవడం, చివరి నిమిషంలో పార్టీ నిర్ణయం అంటూ నాగబాబు లాంటి వాళ్లు వచ్చి అక్కడ తిష్టవేయడం, ఓడిపోయిన తర్వాత ఎవరికీ కనిపించకుండా పారిపోవడం.
ప్రజారాజ్యం నుంచి ఇదే జరుగుతోంది. ఇప్పుడు పార్టీ పేరుమారిందందే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంతకీ ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబు ఏం చెబుతారో, ఏం సాధిస్తారో, ఎవరి సీటుకి ఎసరు పెడతారో చూడాలి..?