వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుకుని ఆ పార్టీ ఫైర్ బ్రాండ్, మంత్రి రోజా వరకు ప్రతిరోజు చెప్పే మాట సింహం సింగిల్ గా వస్తుందని, పందులే గుంపులుగా వస్తాయని. అంటే వైసీపీ బలంగా ఉంది కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తోందని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
విపక్షాలు బలహీనంగా ఉండటంతో పొత్తులతో వస్తున్నాయనేది అధికార పార్టీ విమర్శల్లోని సారం. సింగిల్‌కు తెలుగు అర్థం ఒంటరి అని. సింగిల్‌ను బలానికి వాడవచ్చు. లేదా బలహీనంగా మారినందుకు కూడా వాడవచ్చు. వైసీసీ సింగిల్ బలమా? బలహీనంగా మారిన ఒంటరితనమా? అనే చర్చకు తెరలేచింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా సింహం సింగిల్‌కు బలమైన ఎదురు దెబ్బ తగిలింది. ఎంతగా అంటే కుప్పంతో సహా వై నాట్ 175 అన్న నినాదం అధికార పార్టీది అయితే, తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పంలో గెలుస్తాడా అన్న అనుమానంతో ప్రతిపక్ష దుస్థితి. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం పరిధిలోని రెండు స్థానాల్లో తెలుగుదేశం అనూహ్యంగా విజయం సాధించింది అనడం కన్నా వైసీపీ ఓడిపోయిందనడం బాగుంటుంది.
పట్టభద్రుల ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలవలేదు అంటే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాంటి ఎన్నికల్లో కూడా సింహం సింగిల్ నినాదంతో బొక్క బోర్లాపడింది. అధికార పార్టీ చివరకు కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల స్థానంలో అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో పైచేయి సాధించి కూడా ఓడిపోయింది. దీంతో వై నాట్ కుప్పం అనే స్థాయి నుంచి వై నాట్ పులివెందుల అనే స్థాయికి వైసీపీ పడిపోయింది.
ఒంటరిగా మారుతున్న వైనం
ప్రత్యర్థిని బలహీన పరిచే క్రమంలో వైసీపీ ఒంటరిగా మారిపోయే దుస్థితికి పడిపోతోంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నీటి ప్రాజెక్టుల సందర్శన కోసం బస్సు యాత్ర పేరుతో పర్యటిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఓడినా గెలిచినా వైసీపీ పైచేయి సాధించే ప్రాంతాలు రాయలసీమ, నెల్లూరు. చంద్రబాబు ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభించడం గమనార్హం. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబుపై సీమ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటి ప్రాంతంలో యాత్ర చేపట్టడం సాహసమే.
విచిత్రంగా సీమ ఉద్యమ సంస్థల నుంచి ప్రతిఘటన ఉంటుందని అనుకుంటే రాయలసీమ ఉద్యమ నేతలు ఒక్కరంటే ఒక్కరూ వ్యతిరేకంగా మాట్లాడలేదు. చంద్రబాబు చెబుతోంది నిజమని అనుకుంటే పొరపాటే. తాము ఆశించిన విధంగా వైసీపీ పాలన లేకపోవడంతో పాటు ఏదైనా చెబుదామన్నా వినే నాధుడు లేరన్న దుస్థితి. వైసీపీపై అంతో ఇంతో సానుకూలంగా ఉండే రాయలసీమ ఉద్యమనేతలు నేడు దూరంగా జరిగినట్లే.
టీటీడీ బోర్డు నియామకంపై ఒత్తిడి
ఏదైనా పదవుల నియామకం చేపడితే ఒత్తిడి ఉంటుంది. కానీ నేడు టీటీడీ బోర్డు నియామకం ఆలస్యం కావడానికి ప్రభుత్వ పెద్దపై ఒత్తిళ్లే కాదు, ఆశావహుల బెదిరింపు ధోరణి కనపరచడం కారణంగా చెబుతున్నారు. అవకాశం ఇస్తే ఇవ్వండి లేదా మా దారి మేము చూసుకుంటామని హెచ్చరిక ధోరణిలో మాట్లాడుతుండటంతో అధిష్టానం పెద్దలు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట.
పోనీ ఈ విషయం జగన్ దృష్టికి తీసుకెళ్దామనుకుంటే, మన వాళ్లే అలా ఎందుకు అంటున్నారని ప్రశ్నిస్తే జగన్ కు ఏమి చెప్పాలని చుట్టూ ఉన్న కోటరీని వేధిస్తున్న ప్రశ్న. జగన్ దగ్గర పూర్తి స్వేచ్ఛను పొందిన కోటరీ ఏనాడూ పార్టీని, జగన్ ను నమ్ముకుని ప్రేమిస్తున్న వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే జగన్‌కు వ్యతిరేక తీవ్రతను చెప్పలేక, ఆశావహులకు నచ్చచెప్పలేక సతమతమవుతున్నారు.
తనను అమితంగా ఇష్టపడే శ్రేణులు, వివిధ తరగతి వారే తనకు దూరంగా మారడం జగన్ అనే సింహం సింగిల్‌కి అర్థం బలానికి చిహ్నంగా చూడాలా? లేక తన వారిని దూరం చేసుకుని ఒంటరిగా మారి బలహీనతకు చిహ్నమా? జగన్ అనే సింహం నిజాలను తెలుసుకునే దాని బట్టి సింహం సింగిల్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
పీ.ఝాన్సీ