వ‌ల్ల‌భ‌నేని వంశీ నెత్తిన పాలుపోసిన యార్ల‌గ‌డ్డ‌!

వైసీపీలో అధికారికంగా ఇంకా ఎవ‌రికీ టికెట్లు ఖ‌రారు చేయ‌లేదు. కానీ వ్య‌క్తిగ‌తంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ కొంద‌రి విష‌యంలో గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు, ఇస్తున్నారు. అయితే గ‌న్న‌వ‌రం విష‌యంలో చాలా కాలంగా వివాదం న‌డుస్తోంది. టీడీపీ…

వైసీపీలో అధికారికంగా ఇంకా ఎవ‌రికీ టికెట్లు ఖ‌రారు చేయ‌లేదు. కానీ వ్య‌క్తిగ‌తంగా సీఎం వైఎస్ జ‌గ‌న్ కొంద‌రి విష‌యంలో గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు, ఇస్తున్నారు. అయితే గ‌న్న‌వ‌రం విష‌యంలో చాలా కాలంగా వివాదం న‌డుస్తోంది. టీడీపీ త‌ర‌పున గెలిచి, వైఎస్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వంశీ నాయ‌క‌త్వాన్ని పాత వైసీపీ నేత‌లు వ్య‌తిరేకిస్తున్నారు. వీరిలో ప్ర‌ధానంగా వంశీపై ఓడిపోయిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావ్ ఉన్నారు.

గ‌న్న‌వ‌రం వైసీపీలో యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావ్ అల‌జ‌డి సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొంత కాలంగా గ‌న్న‌వ‌రానికి దూరంగా ఉంటున్న యార్ల‌గ‌డ్డ‌… ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో తాను కూడా బ‌రిలో వుంటానంటూ ముందుకొచ్చారు. ఆదివారం ఆయ‌న స‌న్నిహితుల‌తో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో సంబంధం లేకుండానే వల్ల‌భ‌నేని వంశీకే గ‌న్న‌వ‌రం టికెట్ అని యార్ల‌గ‌డ్డ ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పారు. రాజ‌కీయంగా అవ‌గాహ‌న లేనిత‌నంతో యార్ల‌గ‌డ్డ వ్య‌వ‌హ‌రించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆత్మీయ స‌మావేశంలో యార్ల‌గ‌డ్డ త‌న దారి ఎటు అనేది స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోయారు. మ‌రోవైపు ఆయ‌న టీడీపీలో చేరుతార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ఆ విష‌యాన్ని కూడా ఆయ‌న బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యార్ల‌గ‌డ్డ నిర్వ‌హించిన ఆత్మీయ స‌మావేశం… అంతిమంగా రాజ‌కీయంగా వ‌ల్ల‌భ‌నేనికి మేలు చేకూర్చేదిగా సాగింద‌నేది వాస్త‌వం. ఈ స‌మావేశంలో యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ త‌న‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ వ‌ద్ద ఏ మాత్రం ప‌లుకుబ‌డి లేద‌ని చెప్పుకున్నారు.

“రెండేళ్లుగా సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను అపాయింట్‌మెంట్ అడుగుతున్నా ఇవ్వ‌లేదు. అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాసినా స్పందించ‌లేదు” అని యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావ్ వాపోయారు. దీంతో వైసీపీ శ్రేణుల‌కు వైఎస్ జ‌గ‌న్ వ‌ద్ద బ‌లం ఎవ‌రికో యార్ల‌గ‌డ్డ తేల్చి చెప్పిన‌ట్టైంది. అలాంట‌ప్పుడు వైసీపీ శ్రేణులు యార్ల‌గ‌డ్డ వెంట వెళ్లే ప్ర‌స‌క్తే వుండ‌దు. అస‌లు అపాయింట్‌మెంటే ఇవ్వ‌ని సీఎం జ‌గ‌న్‌, ఇక యార్ల‌గ‌డ్డ‌కు టికెట్ ఏమిస్తార‌నే ప్ర‌శ్న ఆత్మీయ స‌మావేశానికి వెళ్లిన వాళ్ల మ‌ధ్య సాగింది. దీంతో వ‌ల్ల‌భ‌నేనికి వైసీపీ టికెట్ ఖాయ‌మ‌ని యార్ల‌గ‌డ్డ ప్ర‌క‌టించిన‌ట్టైంది.