'కరోనాతో కలిసి జీవించడాన్ని నేర్చుకోవాలి..' అని అంటోంది కేంద్ర ప్రభుత్వం. మే 17 తర్వాత పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందించడం గమనార్హం. కరోనాతో లాక్ డౌన్ ను ఇంకా పొడిగిస్తూ పోవడం జరిగే పని కాదనే విషయం కేంద్రానికి పూర్తిగా అర్థం అవుతున్నట్టుగా ఉంది. ఇప్పటికే చాలా రకాలుగా మినహాయింపులను ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో రకరకాల వ్యాపార సంస్థలు కూడా తెరచుకుంటూ ఉన్నాయి. అయితే ఇంకా చాలా చోట్ల అప్రకటిత లాక్ డౌన్ కొనసాగుతూ ఉంది.
మరోవైపు కరోనా కేసులూ పెరుగుతున్నాయి. లాక్ డౌన్ తో సంబంధం లేకుండా కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మాత్రం మినహాయించక తప్పని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంది. ఇంకా లాక్ డౌన్ ను కొనసాగిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. మరోవైపు యూరప్ దేశాలు కూడా తప్పనిసరిగా జనజీవనాన్ని పట్టాలెక్కిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా కరోనాతో కలిసి జీవించక తప్పదు, కరోనాతో కలిసి జీవించడాన్ని నేర్చుకోవాలని దేశానికి ఒక సందేశం ఇవ్వనే ఇచ్చింది.
మరి ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాటలను ప్రస్తావించకతప్పదు. కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని జగన్ ప్రకటిస్తే.. పచ్చబ్యాచ్ గగ్గోలు పెట్టింది. పచ్చచొక్కాలు లోపల దాచి.. పైకి ఎర్రచొక్కాలు, కాషాయ చొక్కాలు ధరించిన వాళ్లు కూడా కరోనాతో సహజీవనం అనే మాట జగన్ అనగానే ఎగిరెగిరి పడ్డారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమూ అదే మాటే చెప్పింది. కరోనాతో కలిసి జీవించడాన్ని నేర్చుకోవాలని ప్రజలకు సూచించింది. మరి ఇప్పుడేమంటారు? వీళ్లందరి కన్నా ముందు జగన్ ఇదే మాటే చెబితే, వెర్రిమాటలు మాట్లాడినట్టుగా ఇప్పుడూ మాట్లాడతారా! మాట్లాడగలరా? ఏదేమైనా తెలుగుదేశం పార్టీ వర్గాల తీరు వల్ల జగన్ లోని దార్శానికత మరింతగా బయటపడుతున్నట్టుగా ఉంది!