పాదయాత్ర : లోకేష్ కాదు, చంద్రబాబే చేయాలి!

పాదయాత్ర అంటే కేవలం కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లడం మాత్రమే కాదు. అలాంటి కొన్ని వందల కిలోమీటర్ల పొడవున ఉండే లక్షల జీవితాలను పరిశీలిస్తూ వెళ్లడం.  Advertisement ఆ లక్షలాది జీవితాల్లోని కష్టాలను…

పాదయాత్ర అంటే కేవలం కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లడం మాత్రమే కాదు. అలాంటి కొన్ని వందల కిలోమీటర్ల పొడవున ఉండే లక్షల జీవితాలను పరిశీలిస్తూ వెళ్లడం. 

ఆ లక్షలాది జీవితాల్లోని కష్టాలను గమనిస్తూ వెళ్లడం, వారి వెతలను వినడం, ఆ కష్టాల పరిష్కారాల గురించి ఆలోచిస్తూ ముందుకు సాగడం! అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాదయాత్ర గురించిన ఆలోచన చేస్తున్నప్పుడు.. చేసేదేదో చంద్రబాబునాయుడు చేస్తేనే పార్టీకి ఎక్కువగా మేలు జరుగుతుందనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో, శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. 

నారా లోకేష్ పాదయాత్ర చేయడం వల్ల లాభమేమీ లేదని, జనాన్ని ప్రభావితం చేయగలిగేలా అది సాగదని, పార్టీ ఇంకాస్త నవ్వుల పాలవుతుందనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్ర అనేది అధికారానికి ఒక దగ్గరి దారి అనే సెంటిమెంటు బాగా ముద్రపడిపోయింది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి సుదీర్ఘమైన పాదయాత్ర నిర్వహించి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదొక దారిగా అందరికీ కనిపించింది. 

2013లో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. 2014లో అధికారంలోకి వచ్చారు. 2018లో ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. 2019లో అధికారం దక్కింది. ఇలాంటి వరుస పాదయాత్రలతో తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంటు ముద్రపడిపోయింది. తెలంగాణలో కూడా కొందరు నాయకులు ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారు.

తాజాగా 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్ర అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్న సెంటిమెంటు అస్త్రంగా కనిపిస్తోంది. మహానాడు ప్రాంగణంలో కూడా పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్త పాదయాత్ర జరగబోతున్నదనే సంగతి చాలా వినిపించింది. నారా లోకేష్ పాదయాత్ర చేస్తారనేది ఈ పుకార్ల సారాంశం. ఈ విషయమై లోకేష్ ను మీడియా అడిగినప్పుడు.. పార్టీ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించడం విశేషం. 

అయితే పార్టీ శ్రేణులు మాత్రం భిన్నాభిప్రాయంతో ఉన్నాయి. లోకేష్ పాదయాత్ర చేయడం వలన ఉపయోగమేమీ ఉండదని, అదేదో చంద్రబాబు చేస్తేనే మేలు జరుగుతుందని వారు అంటున్నారు. చంద్రబాబు 72 ఏళ్ల వయసులో చంద్రబాబు పాదయాత్ర చేపడితే.. ప్రజల్లో సానుభూతి ఇంకా వెల్లువలా వస్తుందనేది పార్టీ శ్రేణుల ఆశ. 

చంద్రబాబుకు వార్ధక్యం వచ్చినా సరే.. చాలా ఫిట్ గానే ఉంటారు. కార్యక్రమాలకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయన ఎక్కువగా నడుస్తుంటారు కూడా. ప్రతిరోజూ పరిమిత కిలోమీటర్ల దూరం నడిచేలా ప్లాన్ చేసుకుంటూ.. యావత్ రాష్ట్రంలో పాదయాత్ర సాగించడం చంద్రబాబుకు పెద్ద కష్టం కాదని, ఆయన పాదయాత్ర చేయడం వల్ల పార్టీ ప్రజాదరణ గ్రాఫ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

మరి ప్రస్తుతం విపరీతంగా ఉన్న ఎండలు కాస్త తగ్గుముఖం పట్టగానే.. పాదయాత్రకు చంద్రబాబే సిద్ధం అవుతారా? లేదా, నిరంతరం తన కొడుకును ప్రొజెక్టు చేసే యాతనలో ఉండే ఆయన లోకేష్ తో యాత్ర చేయిస్తారా? చూడాలి!!