కావలి గ్రీష్మ…. మహానాడు పుణ్యమా అని వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తెగా 2017లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవల టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నెల రెండో వారంలో ఆమెకు అధికార ప్రతినిధి హోదాను టీడీపీ కట్టబెట్టింది. అసలే నోరున్న యువ మహిళా నాయకురాలు, ఇక మాట్లాడే పదవి…. టీవీ చర్చల్లో ప్రధాన ప్రత్యర్థి వైసీపీ నేతలపై యథేచ్ఛగా నోరు పారేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదలుకుని, వారు వీరు అనే తారతమ్యం లేకుండా, వైసీపీ నేతలైతే చాలు ఎంత మాటైనా అనొచ్చని కావలి గ్రీష్మ నిరూపిస్తున్నారు.
నోటి దురుసు ఏ స్థాయికి దిగజార్చిందో మహానాడులో గ్రీష్మ ప్రసంగం నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ ఈమెకు స్ఫూర్తి ఎవరా? అని ఆరా తీస్తే …టీడీపీ వర్గాలు ఆసక్తికర విషయాలు చెప్పాయి. తల్లి ప్రతిభాభారతిని ఆదర్శంగా తీసుకుని వుంటే గ్రీష్మకు గుర్తింపు మరోలా వుండేది. కానీ గ్రీష్మ స్ఫూర్తిగా తీసుకున్న వనిత మరెవరో కాదు…తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అని టీడీపీ వర్గాలు వెల్లడించడం గమనార్హం.
మార్కెట్‌లో 30 రోజుల్లో హిందీ, ఇంగ్లీష్, తమిళం తదితర భాషలు నేర్చుకోవడం ఎలా? అంటూ పుస్తకాలు కనిపిస్తాయి. ఆ రీతిలో అధినేతల దృష్టిలో పడి సులభంగా పదవులు పొందడం ఎలా? అని నాయకులు మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇలాంటి నేతలకు దొరికిన వక్రమార్గమే ప్రత్యర్థులపై బూతులతో విరుచుకు పడడం. ఇందుకు వైసీపీ, టీడీపీ, జనసేన ఇలా ఏ పార్టీ మినహాయింపు కాదు. కాకపోతే ఎక్కువ తక్కువలొక్కటే తేడా. మగవాళ్లు బూతులు మాట్లాడితే అదో లెక్క. కానీ మహిళలను మన సమాజం అలా వూహించుకోదు.
మహిళలు బూతులు మాట్లాడ్డాన్ని సమాజం సహించదు, గౌరవించదు. ఇటీవల కాలంలో వంగలపూడి టీడీపీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఈ ఫైర్ మహిళా సమస్యలపై పోరాడేందుకు పనికొస్తే తప్పక ప్రశంసలు పొందేవారు. అయితే ప్రత్యర్థులను తిట్టడానికి దుర్వినియోగం కావడమే చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వంగలపూడి అనితకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్ష పదవి తప్ప, ఆమెకంటూ సొంత నియోజకవర్గం లేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏ బాధ్యతా లేని వాళ్లే బజారుమాటలు మాట్లాడుతుంటారని తెలుగు రాజకీయాల్లో ఎంతోమందిని ఉదహరించొచ్చు. ఇటీవల కాలంలో మహిళా నాయకురాళ్ల సంఖ్య పెరగడమే బాధాకరం.
ఉత్తరాంధ్రకు చెందిన అనితను గ్రీష్మ ఆదర్శంగా తీసుకుని రాజకీయంగా త్వరగా ఎదగాలని భావిస్తున్నారట. పాయకరావుపేట నుంచి 2014లో అనిత గెలుపొందారు. అదేంటో గానీ, మనుషులతో సఖ్యతగా ఉండకపోవడం ఆమెకు శాపమని సొంత పార్టీ వాళ్లు చెబుతున్నారు. మంచికి, అనితకు మధ్య పొసగదని, అందుకే ప్రత్యర్థుల కంటే సొంతవాళ్లే ఆమెని వ్యతిరేకిస్తారనే టాక్ తెలుగుదేశం పార్టీలో ఉంది. అందుకే 2019లో ఆమెకు పాయకరావుపేటలో టికెట్ దక్కలేదని ఉదహరిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు టికెట్ కేటాయించారు. కొవ్వూరులో ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత చేతిలో అనిత పరాజయం పాలయ్యారు. అనంతరం అక్కడికి వెళ్లడం మానేశారు.
సొంత నియోజకవర్గం పాయకరావుపేటకు వెళ్దామంటే, అక్కడ సొంత పార్టీ నేతలే ఒప్పుకునే పరిస్థితి లేదు. అనితో, తామో తేల్చుకోవాలని పాయకరావుపేట టీడీపీ నేతలు అధిష్టానానికి తేల్చి చెప్పారు. అనిత వద్దు, మీరే ముద్దు అని నచ్చచెప్పినట్టు సమాచారం. దీంతో పొలిటికల్ బ్యూటీ అనితను పార్టీ ప్రచారానికి ఓ పదవి కట్టబెట్టారు. ఇదే మహాభాగ్యం అనుకుని ఆమె చెలరేగిపోతున్నారు. పార్టీ పదవి ఓకే, కానీ తనకంటూ ఒక నియోజకవర్గం కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఏం చేయాలనే ఆలోచన నుంచే అవాకులు చెవాకులు పేలుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీలో తాను పెద్ద నాయకురాలని ఆమె ఫీల్ అవుతున్నారు. అనితకు గుర్తింపు వచ్చింది కదా, తాను కూడా అదే పంథాలో వెళితే సులభంగా టీడీపీ పెద్దల దృష్టిలో పడతానని కావలి గ్రీష్మ భావిస్తున్నారని సమాచారం. అనితను గ్రీష్మ గుడ్డిగా ఫాలో అవుతున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే లోకం ఏమనుకుంటే నాకేం, టీడీపీబాస్ మెప్పు పొందితే చాలని గ్రీష్మ నోటికి పని చెప్పారు.
తన అందానికి మాట మరింత శోభ తెస్తుందని గ్రీష్మ భావించినట్టున్నారు. కానీ మౌనానికి మించిన అలంకారం ఉండదని ఆమెకు త్వరలో తెలిసొస్తుంది. ఇదిలా వుండగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం అసెంబ్లీ టికెట్‌ను కావలి గ్రీష్మ ఆశిస్తున్నారు. అక్కడ కోండ్రు మురళీమోహన్‌రావు రూపంలో బలమైన టీడీపీ నాయకుడు ఉన్నారు. ఇదే గ్రీష్మను భయపెడుతోంది.
కోండ్రును కాదని తనకు టికెట్ ఇవ్వాలంటే, ముందు సొంత పార్టీలోని పోటీదారుల కంటే తానే వీరవిధేయురాలినని నిరూపించుకోవాలి. రాజాం నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడం మానేసి, మీడియాలోనూ, పార్టీ పెద్దల వద్ద ప్రాపకం కోసం గ్రీష్మ పరితపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆకట్టుకునే రూపం ఉండడంతో ఎల్లో చానళ్లు కూడా పదేపదే ఆమెను డిబేట్లకు పిలుస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో కావలి గ్రీష్మ ఆశించినట్టు రాజాం టికెట్ దక్కుతుందా? ప్రత్యర్థులపై తొడగొట్టినంత మాత్రాన చంద్రబాబు, లోకేశ్ మెచ్చి అందలం ఎక్కిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వంగలపూడి అనిత తలకిందులుగా తపస్సు చేస్తున్నా, ఆమెకంటూ ఒక నియోజకవర్గ బాధ్యతలు అప్పగించని దుస్థితి. అలాంటిది కావలి గ్రీష్మకు మాత్రం ఆదరణ దక్కుతుందని ఎలా నమ్మడం?