రాజకీయాలు ఎప్పుడూ మారుతూ వుంటాయి. ఎప్పుడెలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. అధికారం మీద తప్ప, వ్యక్తుల మీద మమకారం, ద్వేషం పెంచుకుంటే రాజకీయాల్లో ఎప్పటికీ రాణించలేరు. అధికారం మీద మమకారం పెంచుకోవడం వల్లే చంద్ర బాబు, వైఎస్ జగన్ రాణించగలిగారు. కానీ పవన్‌కల్యాణ్ విఫల రాజకీయ నేతగా మిగిలారు. చంద్రబాబుపై మమకారం, జగన్‌పై అకారణంగా ద్వేషం పెంచుకోవడం వల్లే రాజకీయాల్లో పవన్‌కల్యాణ్ భవిష్యత్ త్రిశంకు స్వర్గంలో ఉండిపోయింది.
తాజా రాజకీయ పరిణామాలు జనసేనాని పవన్‌కల్యాణ్‌కు పెద్ద గుణపాఠమే. ఇలాంటి రాజకీయ పరిణామాల్ని భారతీయ జనతా పార్టీ ముందే పసిగట్టింది. అయితే మిత్రపక్షమైన జనసేనానికి అర్థం కావాలంటే, స్వీయ అనుభవాలు ఎదురు కావాలని ఆకాంక్షించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే… చాలా వేగంగా చంద్రబాబు కుట్రస్వభావం పవన్‌కు తెలిసొచ్చింది. రెండు వారాల క్రితం వరకూ నీవు లేనిదే జగన్‌ను అధికారం నుంచి దించలేమని పవన్‌ను పరోక్షంగా చంద్రబాబు రెచ్చగొడుతూ వచ్చారు. జనసేన, బీజేపీ పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా పొత్తుల ఆహ్వానాన్ని చంద్రబాబు పంపారు.
అయితే బాదుడేబాదుడు, మహానాడు తదితర పెద్ద కార్యక్రమాలకు భారీగా జనం వస్తున్నారని, సొంతంగానే అధికారంలోకి వస్తామనే ధీమా చంద్రబాబులో పెరిగింది. ఎటూ బీజేపీ తమతో పొత్తును వ్యతిరేకిస్తుండడంతో టీడీపీ పట్టించుకోలేదు. మరోవైపు పవన్‌కల్యాణ్ సానుకూల సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో మొదట పవన్‌కల్యాణ్‌తో పొత్తుకు తహతహలాడిన టీడీపీ, ప్రస్తుతం ఎలా తప్పించుకోవాలని చూస్తోంది.
అందుకే ఎన్నికలకు ముందు పొత్తుల గురించి ఆలోచిద్దామని టీడీపీ దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. టీడీపీ నుంచి ఇలాంటి తిరస్కార వైఖరిని జనసేన అసలు ఊహించలేదు. జనసేన తనకు తానుగా బీజేపీతోనే వెళ్తానని ప్రకటించేందుకే ఎన్నికల వరకూ పొత్తు ప్రస్తావన లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
పవన్ అడిగిన రోడ్‌మ్యాప్‌ను అధికారికంగా బీజేపీ త్వరలో ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. జనసేనాని పవన్‌కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు ఇదే సరైన సమయమని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం.
టీడీపీ నిజస్వరూపాన్ని పవన్ కళ్లకు కట్టేందుకే తాము నాన్చివేత ధోరణి అవలంబించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. పవన్‌ను చంద్రబాబు కరివేపాకులా వాడుకోవాలని చూశారని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్టీఆర్ లాంటి మహానాయకుడినే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు …పవన్ ఓ లెక్కా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అంతిమంగా పవన్ బలిపశువయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.