బయోపిక్ తీసినప్పుడు ప్రధానంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. సదరు వ్యక్తి నిజజీవితానికి ఎంత దగ్గరగా బయోపిక్ ఉందనేది ప్రధానమైన చర్చ. ఇలా దగ్గరగా లేకనే ఎన్టీఆర్ పై తీసిన బయోపిక్ డిజాస్టర్ అయింది. మరి మేజర్ సినిమా సంగతేంటి? సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీసిన ఈ సినిమా, అతడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందా? లేక అతడ్ని కేవలం ఓ హీరోగా మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తుందా?
“మొదటి రోజు నుంచి ఈ కథను నిజాయితీగా చెప్పాలని మాత్రమే అనుకున్నాం. కాకపోతే ఏ బయోపిక్ కూడా వంద శాతం నిజం కాదు. మేజర్ కూడా అలాంటిదే. సినిమా కోసం కొన్ని లిబర్టీస్ తీసుకున్నాం. అయితే మేం ఏం చేసినా ప్రతి సీన్ లో సందీప్ ఆత్మను, స్ఫూర్తిని చూపించే ప్రయత్నం చేశాం. ఇది డాక్యుమెంటరీ కాదు, ఎంటర్ టైనర్. కాబట్టి యాక్షన్ సీన్స్ లో స్టయిల్ పెట్టాం. పాటలు పెట్టాం. ఇవి లేకపోతే ఎంటర్ టైన్ చేయలేం.”
ఓవరాల్ గా మేజర్ సినిమాను నిజాయితీగా తీశాం అంటున్నాడు హీరో అడివి శేష్. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో ఎంత దేశభక్తి, స్ఫూర్తి ఉందో.. అదంతా చూపించలేకపోయామని, కొన్నిసార్లు సందీప్ జీవితంలో జరిగిన 5-6 ఘటనల్ని ఒకే సీన్ లో చూపించామని తెలిపాడు.
ఓవరాల్ గా మేజర్ సినిమాను సందీప్ నిజజీవితానికి దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేశామని, అతడి జీవితం చాలామందికి స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతోనే తీశామని చెప్పుకొచ్చాడు శేష్. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది మేజర్ మూవీ. ఈ మూవీ ప్రీమియర్ నిన్న వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది.