వైవాహిక జీవితం విజయవంతంగా సాగడంలో ఎవరికైనా కొంత గైడెన్స్ కావాల్సి రావొచ్చు. అదెవరైనా మరో మనిషితో కలిసి జీవించడం అంటే మాటలేమీ కాదు. ప్రత్యేకించి దాంపత్యంలో కమ్యూనికేషన్ గ్యాప్ తోనూ, పరస్పరం పడకపోవడంతోనూ విడాకుల దిశగా సాగే వారు ఎంతో మంది ఉండనే ఉంటారు.
ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీలే ముందు వరసలో ఉంటారు కూడా! మరి అలాంటి సెలబ్రిటీల్లోనే విజయవంతంగా దాంపత్యాన్ని కొనసాగించే వారు కూడా ఉన్నారు. అలాంటి వారు వైవాహిక జీవితంలో తాము విజయవంతంగా సాగుతుండటంలో ఉన్న టెక్నిక్స్ ఏమిటో వివిధ సందర్భాల్లో చెప్పారు. వారి అనుభవాల సంగతేంటి అంటే!
దీపికా పదుకునే..
తను బ్రూటల్ ఆనెస్ట్ అంటోంది దీపిక. నిజాయితీ, పారదర్శకత ల వల్లే తను ఎవరితో అయినా ప్రశాంతంగా ఉండగలనని అంటోంది ఈ నటీమని.
తన జీవితంలో మంచి, చెడు, గతం, వర్తమానం.. ఇలా ఏ విషయంలో అయినా చాలా నిజాయితీగా ఉంటానంటోంది దీపిక. దీని వల్లనే తను దాంపత్యంలో కూడా ఇబ్బందులు లేకుండా వ్యవహరించగలుగుతానని ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ చెబుతోంది.
సోనమ్ కపూర్ అహుజా
వైవాహిక బంధానికి విలువను ఇవ్వడమే తన దాంపత్య జీవితంలో ఆనందానికి కారణమంటోంది సోనమ్. మ్యారిటల్ లైఫ్ పట్ల తను చాలా ఫోకస్డ్ గా ఉంటానని దీపిక చెబుతోంది. తన భర్తతో గడపడానికి కెరీర్ కు సంబంధించి కొన్ని త్యాగాలు చేయడానికి కూడా తను రెడీగా ఉంటానంటోంది.
ప్రియుడిగా ఉన్నప్పటి నుంచినే తన పార్టనర్ కోసం సినిమాలు వేటినైనా వదులుకోవడానికి కూడా సోనమ్ రెడీగా ఉండేదట. తనతో గడపడానికి అలాంటి త్యాగాలకు తను సిద్ధమని, తన కోసం తన పార్ట్ నర్ కూడా అలాంటి త్యాగాలు ఎన్నో చేశాడని ఈ నటీమణి చెప్పింది.
షారూక్ ఖాన్
బాలీవుడ్ లో దశాబ్దాలుగా వైవాహిక జీవితాన్ని విజయవంతంగా సాగిస్తున్న స్టార్ లలో షారూక్ ఒకరు. తన సాటి హీరోలు విడాకుల దిశగా పయనించినా, వారికి బ్రేకప్ లు ఉన్నా షారూక్ మాత్రం దాంపత్యంలో విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాడు.
తన దృష్టిలో భార్యకు ఇచ్చే ప్రేమ అంటే.. ఆమెను గౌరవించడమే అంటున్నాడు. గౌరవించడమే ప్రేమ, గౌరవించడమే రొమాన్స్ అని చెబుతాడు షారూక్.
ప్రియాంక చోప్రా
పరస్పరం ప్రాధాన్యతలు తెలుసుకోవడమే తమ వైవాహిక జీవితంలో హ్యాపీనెస్ కు సీక్రెట్ అని అంటోంది ప్రియాంక. తన కన్నా వయసులో చిన్నవాడైన అమెరికన్ ను వివాహం చేసుకున్న ప్రియాంక తమ కెరీర్ లతో తాము చాలా బిజీగా ఉంటామని అంటోంది.
వేలమైళ్ల దూరంలో తమ పనుల్లో తాము మునిగిపోయి ఉంటామని చెప్పింది. అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి కేవలం ఒక్క రోజు కలవడానికి కూడా వేలమైళ్ల దూరం ప్రయాణించిన రోజులున్నాయని చెబుతోంది. పరస్పరం ప్రాధాన్యతలు తెలిసి మసలుకోవడం వైవాహిక జీవితంలో కీలకమని ప్రియాంక చెబుతోంది.
అనుష్కా శర్మ
తన భర్తతో గడపడం తనకు చాలా విలువైన, ఆనందకరమైన అంశమని అంటోంది అనుష్క. తన కెరీర్ లో తను బిజీగా ఉండటం, తన భర్త విరాట్ కూడా ఫుల్ బిజీగా ఉండటంతో తాము ఇద్దరం కలిసి గడిపే సమయం కోసం ఎంతగానో వేచి చూస్తానంటోంది.
అలాంటి సందర్భం వచ్చినప్పుడు అంతకు మించిన ఆనందం ఉండదని అనుష్క శర్మ తమ దాంపత్య బంధంలోని ఆనందకరమైన ఘట్టం గురించి వివరించింది.