ఏపీలో జగన్ ప్రభుత్వం రేపిన అక్రమ కట్టడాల చిచ్చు మరింతగా పెరిగేలా ఉంది తప్ప ఇప్పట్లో తగ్గేలాలేదు. ఈ చిచ్చు కారణంగా జగన్ ప్రభుత్వానికి ఎంతమేరకు రాజకీయ ప్రయోజనం కలుగుతుందో, ఎంతమేరకు నష్టం వాటిల్లుతుందో కొంతకాలం తరువాత స్పష్టమవుతుంది. అక్రమ కట్టడాలను తొలగించే పని మంచిదే. కాని ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ఈ పని చిత్తశుద్దిగా చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. అక్రమ కట్టడాలను ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయే తప్ప ఒక విధానంగా దాన్ని అమలు చేయలేదు. బహుశా చేయడం కూడా సాధ్యంకాదు. ఏ స్థాయివారి అక్రమ కట్టడాలనైనా కూల్చడం అనేది సినిమాల్లో జరుగుతుందేమోగాని వాస్తవంలో జరగదు. అక్రమ కట్టడాలను కూల్చడంలో పాలకులు తన, పర భేదంలేకుండా వ్యవహరించగలరా అంటే అదీ జరగదని చెప్పవచ్చు.
అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ తొలి కూల్చివేతగా ప్రజావేదికను ఎంపిక చేసుకొని చెప్పినట్లే చేశారు. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది. ప్రజావేదిక కూల్చివేతను కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకించారు. కూల్చివేతను వ్యతిరేకిస్తున్నవారు అసలు ఇది అక్రమ కట్టడం కాదని, కరకట్టకు చాలాదూరంగా ఉందని అంటున్నారు. ఎవరేమన్నా ఆ భవనం చరిత్ర ముగిసిపోయింది. దీని తరువాత కరకట్ట మీద ఉన్న కొన్ని భవనాల యజమానులకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక వాటి భవిష్యత్తు తేలాల్సి ఉంది. వాటిల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్ భవనం కూడా ఉన్న సంగతి తెలిసిందే.
టీడీపీకి అనుకూలంగా ఉంటుందని పేరుపడిన ఓ పత్రిక గోదావరి నదీ తీరంలో ఉన్న అక్రమ నిర్మాణాల గురించి కథనం ప్రచురించి ఇవి కూడా కూలగొడతారా? అంటూ ప్రభుత్వానికి సవాల్ చేసింది. అలాగే విజయవాడలో ఉన్న అక్రమ కట్టడాల గురించి మీడియా ప్రశ్నించింది. అక్కడి కొండలను చెక్కేసి నిర్మించిన ఇళ్ల నిర్మాణాల గురించి వివరించింది. ఏ అక్రమ కట్టడాన్నీ వదలకూడదని ప్రభుత్వం అనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగానే నిర్మాణాలను (అన్ని రకాలవి) తొలగించాల్సివస్తుంది. జగన్ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమూ ఈ పని చేయలేదు. అక్రమ కట్టడాలను కూల్చాలని ప్రభుత్వం భావించినప్పడు యజమానులు ముందుగా చేసే పని కోర్టుకు వెళ్లడం. ఆ కేసుల విచారణ జరిగి ఏదో ఒక తీర్పు రావాలంటే ఏళ్లూపూళ్లూ పడుతుంది. ఆ తరువాత కథ కంచికి చేరుతుంది. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి జగన్ ప్రభుత్వ విధానమేంటో స్పష్టంగా తెలియాల్సి ఉంది.
కేవలం కృష్ణా కరకట్ట మీద ఉండే అక్రమ నిర్మాణాలనే తొలగిస్తారా? గోదావరి, ఇతర నదుల తీరంలో ఉన్న నిర్మాణాలనూ తొలగిస్తారా? వీటితోపాటు రాష్ట్రంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా తొలగిస్తారా? అక్రమ నిర్మాణాలను కచ్చితంగా తొలగించాలనుకుంటే వైకాపా నాయకులవి కూడా తొలగించాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాల్లో ఆలయాలు, చర్చిలు, మసీదులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం వాటి జోలికి వెళ్లగలదా? కృష్ణా కరకట్ట మీద ఇస్కాన్, మరికొన్ని ఆలయాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని తీసేస్తారా? వాటిని నిజంగా తీసేస్తే మతపరమైన భావోద్వేగాలు చెలరేగుతాయి. అది ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో పీఠం ఎక్కినప్పుడు అక్రమ కట్టడాలని కూల్చేస్తామంటూ హడావుడి చేశారు. అప్పట్లో ఇది రచ్చ రచ్చ అయింది. ఆ తరువాత కొంతకాలానికి ఆయన సైలెంట్ అయిపోయారు.
అక్రమ కట్టడాలు ఉన్న చాలామంది ఇతర పార్టీల నాయకులను, ప్రజాప్రతినిధులను 'కూల్చివేత' బెదిరింపుతో టీఆర్ఎస్లో చేర్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. ప్రజావేదిక కూల్చగానే జగన్ ప్రభుత్వంపై మండిపడిన టీడీపీ నాయకులు హైదరాబాదులోని జగన్ నివాసం లోటస్పాండ్ కూడా అక్రమ నిర్మాణమేనని ఆరోపించారు. ఇందులో నిజమెంతో తెలంగాణ ప్రభుత్వం చెప్పాల్సిందే. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బంజారాహిల్స్లో అక్రమంగా ఇంటిని నిర్మించి తన హయాంలోనే క్రమబద్ధీకరించుకున్నారని టీడీపీ నేతలు చెప్పారు. అక్రమ నిర్మాణల చరిత్ర అంతులేనిది. ప్రతి అక్రమ నిర్మాణాన్ని కూల్చడం ప్రభుత్వం వల్ల కాదు. అక్రమ నిర్మాణాలను కూల్చి రాజకీయ ప్రయోజనాలను ఏ ప్రభుత్వమూ దెబ్బ తీసుకోదు. మరి జగన్ ఏం చేస్తారో, ఏ మార్గంలో వెళతారో చూడాలి.