తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు, జగన్ విజయానికి సోపానాలు చెప్పమంటే సామాన్య ఓటరు కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. కానీ టీడీపీ నాయకులకి మాత్రం తమ పార్టీ ఓటమికి కారణాలు ఎంత వెదికినా దొరకడం లేదు. పార్టీ అధినాయకుడు చంద్రబాబే సాక్షాత్తూ ఓటమికి కారణాలు తెలియడం లేదని జుట్టుపీక్కోవడం విచిత్రం. ఆ ఎపిసోడ్ ని మిగతా నేతలు అలాగే కంటిన్యూ చేస్తూ కార్యకర్తల ఉసురుపోసుకుంటున్నారు.
కార్యకర్తల భరోసా కోసమంటూ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు పెట్టుకుంటున్న టీడీపీ నేతలు తమ ఓటమికి చెబుతున్న కారణాలు వింటుంటే.. చంద్రబాబే కాస్త నయం అనిపించక మానదు. మాజీ మంత్రి సోమిరెడ్డి విశ్లేషణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పోల్ మేనేజ్ మెంట్ లో టీడీపీ వీక్ అయిందట. ఎన్నికలకు 10రోజుల ముందే వైసీపీ డబ్బు సంచుల్ని నియోజకవర్గాలకు చేర్చిందట.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం జరిగిందట. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఈ మూడూ కలసి రాష్ట్రంలో టీడీపీని ఓడించాయట. తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు, దేశ, రాష్ట్ర శ్రేయస్సు కోసం చంద్రబాబు చేసిన కృషికి.. మరో దఫా టీడీపీ అధికారంలోకి రావాల్సింది పోయి దారుణ పరాజయం దక్కడం.. దారుణాతి దారుణం అంటూ సెలవిచ్చారు సోమిరెడ్డి.
వచ్చే ఎన్నికల్లో కూడా ఇవే భ్రమలతో బరిలో దిగి టీడీపీ పుట్టిముంచడానికి ఐదేళ్లపాటు తీవ్రంగా కృషి చేసేలా ఉన్నారు సోమిరెడ్డి లాంటి నేతలు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతో జరుగుతున్న దాడులన్నిటికీ రాజకీయ రంగు పులిమి కార్యకర్తల్లో ఒకరకమైన భయోత్పాతాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీపై వైసీపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రెచ్చగొడుతున్నారు.
ఇలాంటి విశ్లేషణలు చేసినంతకాలం టీడీపీకి పదే పదే ఆత్మహత్య తప్పదు. ఊహల్లో నుంచి వాస్తవాల్లోకి వచ్చినప్పుడే పార్టీ కోలుకునే అవకాశం ఉంటుంది. అలా ఊహల్లోనే కార్యకర్తలను నిద్రపుచ్చడానికి అధినాయకుడు సహా.. ఆయన వందిమాగధులంతా శక్తివంచన లేకుండా కృషిచేయడం ఆ పార్టీ దౌర్భాగ్యం.