జైలుకైనా పోవాలి! సారీ అయినా చెప్పాలి!!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి మాత్రమే తమ జీవితాలను అంకితం చేసి పోరాడుతూ ఉండే తెలుగుదేశం నాయకులు తాము చెప్పే మాటలు, చేసే పనుల్లో కనీస విచక్షణకు కూడా చోటు ఇవ్వరు.…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి మాత్రమే తమ జీవితాలను అంకితం చేసి పోరాడుతూ ఉండే తెలుగుదేశం నాయకులు తాము చెప్పే మాటలు, చేసే పనుల్లో కనీస విచక్షణకు కూడా చోటు ఇవ్వరు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడరు. దుర్మార్గ ప్రచారాలకు వెనుకాడరు. 

ఇలాంటి ఆరోపణల్లో కేవలం రాజకీయాలకే పరిమితమైతే అదొక ఎత్తు! అలా కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన వ్యవహారాలను, అక్కడ వ్యవస్థీకృతంగా జరుగుతున్న మంచి ఏర్పాటును కూడా అపకీర్తి పాలు చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా సాగించే దుష్ప్రచారం మాత్రం హేయమైనది! ఖండించదగినది!! అందుకే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీటెక్ రవి మీద టీటీడీ అధికారులు ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన క్షమాపణ అయినా చెప్పాల్సి ఉంటుంది. ఆ మాట చెప్పకుండా దబాయించి నెట్టుకు రావాలని ప్రయత్నిస్తే కనుక జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

తిరుమలలో భక్తులకు గదుల కేటాయింపు వ్యవహారం చాలా పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంటుంది. రికమండేషన్లకు గదులు ఇవ్వడం, కొన్ని గదులు అసలు ఖాళీ ఉన్నట్టుగా భక్తులకు తెలియనివ్వకుండా దాచడం వంటి అవ్యవస్థ ధోరణులు కొన్ని ఉన్నప్పటికీ.. గదులు కేటాయించే సమయంలో భక్తుల నుంచి తీసుకునే కాషన్ డిపాజిట్ వారికి తిరిగి చెల్లించడం చాలా సిస్టమేటిగ్గా జరుగుతుంది. 

గతంలో ఈ డబ్బు తిరిగి చెల్లించడాన్ని నగదు రూపంలో చేసేవాళ్ళు. అలా కౌంటర్లో నగదు భక్తుడికి తిరిగి చెల్లించే సమయంలో కొన్ని అవకతవకలు జరిగే ఆస్కారం ఉండడంతో దాన్ని డిజిటల్ పేమెంట్లుగా మార్చారు. భక్తులు గది పొందేటప్పుడు విధిగా తమ బ్యాంకు అకౌంట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వారు చెల్లించిన కాషన్ డిపాజిట్ మొత్తం, గదిని ఖాళీ చేసిన తర్వాత వారం రోజులలోగా వారు ఏ అకౌంట్ నుంచి అయితే చెల్లించారో అదే అకౌంట్ కు తిరిగి జమ చేస్తారు. ఇందులో తేడా జరిగే అవకాశం లేదు. ఎవరికీ చిల్లర లంచాలు ముట్ట చెప్పే అవసరం కూడా లేదు.  ఆటోమేటిగ్గా గది ఖాళీ చేసిన తర్వాత భక్తుడికి ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత వారం రోజులకి నగదు కూడా వారి అకౌంట్ కు డిపాజిట్ అవుతాయి.

ఇంత పద్ధతి ప్రకారంగా కాషన్ డిపాజిట్ చెల్లింపులు జరుగుతూ ఉంటే, తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ వ్యవహారంపై నిరాధార ఆరోపణలు చేసి టీటీడీ పరువు తీసేందుకు ప్రయత్నించారు. టీటీడీ ఆ డిపాజిట్ల మొత్తాన్ని జగన్ ప్రభుత్వానికి చెల్లిస్తున్నదంటూ ఆయన ఆరోపణలు చేశారు! పసలేని నిరాధార ఆరోపణల్లో కూడా ఇది పరాకాష్ట! రాజకీయంగా ఎంత దిగజారుడు మాటలైనా జరగవచ్చు. కానీ దేవుడు వ్యవహారానికి ముడిపెట్టి అబద్ధాలు చెప్పడం ఘోరం! 

తాను గతంలో తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు వసూలు చేసిన కాషన్ డిపాజిట్ ఇప్పటివరకు తిరిగి తనకు జమ కాలేదని ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై సీరియస్ అయిన టిటిడి అధికారులు తాజాగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ వ్యవహారంలో బీటెక్ రవి సునాయాసంగా బయటపడే అవకాశం లేదు. ఎందుకంటే కాషన్ డిపాజిట్ చెల్లింపు అనేది పూర్తిగా డిజిటల్ రూపంలో ఆన్లైన్ పద్ధతిలో జరిగే వ్యవహారం. ఆయన చెల్లించిన డబ్బు తిరిగి ఆయన అకౌంట్ కు వచ్చి ఉండినప్పటికీ ఆయన గమనించకుండా ఉండే అవకాశం ఎక్కువ. 

‘ఏదో టిటిడి మీద బురద చల్లేస్తే.. టీటీడీ డబ్బులు ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారంటూ ఆరోపణలు చేసేస్తే మజా వస్తుంది’ అని ఆయన అనుకున్నారేమో గాని.. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరకాటంలో పడ్డారు! కాషన్ డిపాజిట్ తిరిగి అయిన అకౌంట్లో జమ అయ్యి ఉంటే ఆ సంగతి బ్యాంక్ రికార్డ్స్ లో స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు బీటెక్ రవి టీటీడీ అధికారులకు దేవుడికి క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అలాంటి పని చేయకపోతే నిరాధార ఆరోపణలు చేసినందుకు టీటీడీని ప్రతిష్ట పాలు చేసేందుకు, భక్తుల్లో అపోహలు అనుమానాలు పెంచేలా ప్రయత్నించినందుకు ఆయన జైలుకైనా వెళ్లాల్సి ఉంటుంది.