నీహారిక ఎన్ ఎమ్…ఈ పేరు మామూలు జనాలకు పరిచయం తక్కువ కావచ్చు కానీ సోషల్ మీడియా జనాలకు మాత్రం పిచ్చ పరిచయం. యూ ట్యూబ్,సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా నీహారిక పేరు టాప్ లో వుంటుంది. ఇటీవలే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా అడుగుపెట్టింది ఆమె. విదేశాల్లో ఎంబిఎ చదువుతున్న ఈ వీడియోలు అవీ చూసి సూపర్ స్టార్ మహేష్ కూడా ఇన్ ఫ్లూయెన్స్ అయిపోయారు.
సర్కారు వారి పాట, మేజర్ సినిమా ప్రమోషన్లకు ఆమెను పిలిపించి మరీ వీడియోలు చేయించుకున్నారు. లేటెస్ట్ గా నిన్నటికి నిన్న వదిలిన మేజర్ టికెట్ ల క్యూలో మహేష్ వీడియో వైరల్ అయిపోయింది. సర్కారు వారి పాట టైమ్ లో, మహేష్ తన సోషల్ మీడియా వింగ్ కు తానే స్వయంగా చెప్పి మరీ నీహారికను పిలిపించారు.
పార్క్ హయాత్ హొటల్ లో మహేష్ తాళాల బంచ్ ను దొంగిలించే వీడియోను రూపొందించింది ఈమెనే. ఆ వీడియోలో 'ఆక్ట్యువల్లీ ఐ లైక్ యూ' అని ఎండ్ చేసిన స్టయిల్ భలేగా వుంటుంది.
ఇప్పుడు లేటెస్ట్ గా మేజర్ సినిమా టికెట్ క్యూలో చేసిన వీడియో కూడా క్యూట్ గా అందరినీ ఆకట్టుకుంటోంది. నిజానికి మహేష్ సర్కారు వారి పాట, మేజర్ కోసం నీహారిక ను పిలిపించడానికి దారి తీసింది కేజిఎఫ్ 2 ప్రమోషన్ కోసం ఆమె చేసిన వీడియో…
నీహారిక చేసే ప్రమోషన్ వీడియోలు ఫోర్స్ డ్ గా వుండవు. చాలా నాచురల్ గా వుంటాయి. సినిమా కంటెంట్ లోంచి ఐడియాలు తీసుకుంటూనే, చాలా క్యూట్ గా వీడియోలు ప్లాన్ చేయడం నీహారిక స్పెషాలిటీ. ఇన్ స్టా లో మిలియన్ల ఫాలోవర్లు వున్న నీహారిక ప్రస్తుతం ఛాప్మన్ యూనివర్సిటీ (కాలిఫోర్నియా) లో ఎంబిఎ చేస్తోంది.
విశేషమేమిటంటే నీహారిక సోషల్ మీడియా జర్నీని విదేశీ ఎంబిఎ విద్యార్థులు ఓ కేస్ స్టడీగా కూడా తీసుకోవడం. చెన్నయ్ లో పుట్టిన నీహారిక తాను ఆంధ్ర, కర్ణాటక, తమిళ ఇలా ప్రాంతాలకు చెందిన అమ్మాయిని అంటుంది. ఎందుకంటే ఆమె పుట్టింది తమిళనాట అయినా పెరిగింది బెంగుళూరులో.
పట్టుమని పాతికేళ్లు లేకుండా ప్రపంచ సోషల్ మీడియా యవనిక మీద తళక్కున మెరిసిన నీహారిక ను సూపర్ స్టార్ మహేష్ కోరి పిలిపించడం ఎంత మాత్రం ఎక్కువ కాదు.