ఆంధ్రలో కమ్మ..రెడ్డి సామాజిక వర్గాల మధ్య అధికార యుద్దం నడుస్తోంది. అది అందిరకీ తెలిసిందే. ఈ యుద్దంలో కాపు, బిసి ఓట్లను అటు ఇటు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా తెలిసిందే. కాపుల అండతో కాంగ్రెస్ పార్టీ చిరకాలం ఆంధ్రలో అధికారం చెలాయించినపుడు, కమ్మవారి కోసం నాదెండ్ల అండ్ కో ప్రోద్బలంతో ఎన్టీఆర్ రంగంలోకి దిగి, బిసి లను తోడు తీసుకుని అధికారం సంపాదించారు. దానికి పూర్వ రంగంగా జనాలకు తెలియకుండానే కాంగ్రెస్ మీద ఓ భయంకరమైన వ్యతిరేకత వచ్చేలా అప్పటి మీడియా గ్రౌండ్ ప్రిపేర్ చేసింది.
అప్పట్లో ఈ మీడియా..ఆ మీడియా అనే వైనాలు జనాలకు తెలియదు. మీడియాను గుడ్డిగా ఫాలో కావడమే తెలుసు. ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ను ఎంత బదనామ్ చేయాలో అంతా చేసి, గ్రౌండ్ ప్రిపేర్ చేసారు. నిజానికి అప్పట్లో ఆ మీడియా బదనామ్ చేసిన కాంగ్రెస్ లీడర్లు, సిఎమ్ ల పిల్లలు అంతా ఇప్పుడు ఎక్కడ ఏ స్థితిలో వున్నారో తెలిస్తే, ఆశ్చర్యం వేస్తుంది. ఇంత బదనామ్ చేసిన లీడర్లు సంపాదించిది ఏమీ లేదా అని తెలిస్తే ఆశ్చర్యమే కదా.
ప్రతి చోటా తొమ్మిది సీట్లు బిసి లకు ఇచ్చి, ఓ సీటు తమ సామాజిక వర్గానికి కేటాయించి, తమ వర్గం ఆంధ్ర అంతటా అలుముకునేలా చేసిన పార్టీ నేత మాత్రం తెలుగుజాతి యుగకర్తగా మిగిలిపోయారు. సరే, అదంతా గతం.
మొత్తానికి ఇప్పుడు ఆంధ్రలో కమ్మ..రెడ్డి వార్ స్థిరమైపోయింది. 2024 లో ఎలాగైనా అధికారం అందుకోవాల్సిందే అని రెండు వర్గాలు దారుణంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి తెలంగాణ ఏర్పాటయింది ప్రాంతీయ వాదం మీద. అప్పటి వరకు తెలంగాణలో కూడా రెడ్లదే హవా. రాష్ట్రం సమైక్యంగా వున్నపుడు రాయలసీమ రెడ్లు, తెలంగాణ రెడ్లు అధికారం కోసం కొట్టుకున్నారు. రెడ్లు అధికారం లేకపోతే కాంగ్రెస్ లో కిందా మీదా అయిపోయేది పరిస్థితి. అలాంటి నేపథ్యంలోనే అదే పార్టీకి చెందిన పివి నరసింహారావు అర్థాంతరంగా ముఖ్యమంత్రి పదవి వదలుకున్నారు. తెలంగాణ, రాయలసీమ రెడ్లు ఒకరి కాళ్లు మరొకరు లాక్కున్నారు అప్పట్లో. వైఎస్ వచ్చాక వారిని ఏక తాటి మీదకు తెచ్చి, ఆంధ్ర రెడ్లను కూడా ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు వారి తో జతకలిపారు.
ప్రాంతీయ వాదం ప్రబలి రాష్ట్రం రెండుగా మారిన తరువాత తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలు కూడా అదే పాయింట్ ను అండర్ కరెంట్ గా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చాయి. కానీ రాబోయే ఎన్నికల్లో ఇక ప్రాంతీయ వాదాన్ని పక్కన పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పాటు అయిపోయిన ఇన్నేళ్ల తరువాత కూడా అదే వాదం వినిపించడం సరిగ్గా వుండదు. కానీ ఈ వాదాన్నే ఇన్నాళ్లూ నమ్ముకున్న టీఆర్ఎస్ ఆ పని చేయడం లేదు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ దిశగా అడుగు ముందుకు వేసారు. రెడ్ల పాలనా పటిమను పొగడడం ద్వారా ఈ తరహా పోరుకు తెరతీసారు. నిజానికి చిరకాలం అధికారం అనుభవించిన తెలంగాణ రెడ్లు ఒక్క టెర్మ్ రాయలసీమ రెడ్లకు అధికారం దక్కితేనే సహించలేకపోయేవారు. నిత్యం ఢిల్లీ యాత్రలు చేసి అసమ్మతి స్వరాలు వినిపించి, మొత్తానికి కిందకు లాగేవారు. అలాంటిది రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి అధికారానికి దూరంగా వుంటున్నారు. ఆ ఫ్రస్టేషన్ మామూలుగా వుండదుగా.
అప్పటికీ కేసిఆర్ తనకు వున్న రాజకీయ అనుభవంతో రెడ్లకు వీలయినంత ప్రాధాన్యత ఇస్తూనే వస్తున్నారు. పదవులు, సీట్లు కేటాయిస్తూనే వస్తున్నారు. అయినా ఇంకా అధికారం లేని లోటు రెడ్లను పట్టి పీడిస్తున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్ గా జరిగిన రెడ్ల ఘర్జనలో ఆ వైనం బయటపడింది. మంత్రి మల్లారెడ్డి మీద తోటి రెడ్లు విరుచుకుపడిన తీరు ఇది సష్టం చేస్తోంది.
అంటే ఇక తెలంగాణలో కూడా రెండు అగ్రకులాల పోరు తప్పదన్నమాట. ఆంధ్రలో కమ్మ..రెడ్డి అయితే తెలంగాణలో వెలమ..రెడ్డి అన్నమాట. అయితే తెలంగాణలో స్థిరపడిన ఆంధ్ర అగ్రవర్ణాలు అయిన క్షత్రియ, కమ్మ కులాలు టీఆర్ఎస్ కే అండగా వుండే అవకాశం క్లారిటీగా వుంది. బ్రాహ్మణ వర్గాలు భాజపా వెంట వెళ్లే అవకాశం వుంది. అందువల్ల తెలంగాణలో కూడా బిసి, కాపు, దళిత ఓట్లు ఎవరు తమ ఖాతాలో వేసుకోగలిగితే వారికి అధికారం సంప్రాప్తించే అవకాశం వుంది. కేసిఆర్ అందుకే దళిత బంధు మీద అంత ఫోకస్ పెట్టారు. భాజపా బిసి, కాపు ఓట్ల మీద దృష్టి పెట్టింది.
కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేవలం రెడ్డి ఓట్ల మీద దృష్టి పెట్టి ఏం సాధిద్దామని? కేవలం ఆ ఓట్ బ్యాంక్ అధికారసాధనకు సరిపోదు. పైగా దాని వల్ల వేరే వర్గాలు మరింత దూరం అయ్యే ప్రమాదం వుంది. ఇలాంటి స్టాండ్ తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ ను విజయానికి దగ్గర చేయాలని అనుకుంటున్నారా? దూరం చేయాలనుకుంటున్నారా? అన్నది అనుమానం. ఎందుకంటే రెడ్డి వర్గానికి చెందిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ సాధన కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.
ఏమైతేనేం ఇక తెలంగాణ 2023 ఎన్నికల ప్రచారం ప్రాంతీయ వాదం మీద కాకుండా కులాల మీదుగా సాగబోతోందని ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ కేసిఆర్ కు కలిసి వచ్చే అనుకూల అంశం ఏమిటంటే తెలంగాణలో ఆయన పాలనా కాలంలో జరిగిన అభివృద్ది. దాని మీదే కేటిఆర్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు దాంతో పాటు కులాల సమతూక మీద కూడా కేటిఆర్..కేసిఆర్ గట్టి ఫోకస్ పెట్టాల్సి వుంటుంది.