జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలతో ఒక డీల్ పెట్టుకుంటున్నారు. ‘నేను మీకోసం పనిచేయాలంటే.. మీరు నా కోసం ఏం చేస్తారు?’ అని అడిగే డీల్ అది! మీరు నా కోసం ఏమైనా చేస్తే మాత్రమే.. నేను మీకోసం ఏ కొంచమైనా పని చేయగలను.. అని నిర్ద్వంద్వంగా బేరం పెడుతున్న డీల్ అది.
గాజువాక నియోజకవర్గంలో తాజాగా తన వారాహి యాత్రను నిర్వహించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తనను అత్యంత దారుణంగా, అవమానకరంగా ఓడించిన అక్కడి ప్రజలతో ఇప్పుడు కొత్త బేరం పెడుతున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడం గురించి గానీ, విశాఖపట్నంలో తాను ఆరోపిస్తున్న భూ కబ్జాల దుర్మార్గాలను అడ్డుకోవడానికి గాని ముందు ప్రజలు తనకు అధికారం కట్టబెట్టాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ కండిషన్ పెడుతున్నారు.
ప్రపంచంలో బహుశా పవన్ కళ్యాణ్ తరహాలో మాట్లాడే రాజకీయ నాయకుడు ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే ఒకసారి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన తరువాత, ఎంత చిన్న రాజకీయ నాయకుడు అయినా సరే, తాను నిరంతరం ప్రజల కోసమే పని చేస్తుంటానని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు.
ఎన్నికలలో తనను, తన పార్టీని గెలిపించినా ఓడించినా కూడా తాను ప్రజల పక్షాన నిలిచి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ఉంటానని ప్రతి నాయకుడు కొన్ని పడికట్టు మాటలను ప్రతి సందర్భంలోనూ ప్రయోగిస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఇలాంటి ముసుగులో గుద్దులాట అసలు లేనేలేదు. ఆయన తన రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందో, తన డీల్ ఏమిటో.. తన మాటల ద్వారా తెగేసి చెబుతూ వస్తున్నారు.
‘నన్ను గెలిపిస్తే మాత్రమే మీ బాగోగులు చూస్తాను, నన్ను గెలిపిస్తే మాత్రమే మీ సమస్యల మీద పోరాడతాను, నన్ను గెలిపిస్తే మాత్రమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీ గళం కేంద్రం వద్ద వినిపించడానికి ప్రయత్నిస్తాను’ అని పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలు బూటకాలు అని పలువురు కొట్టి పారేస్తున్నారు.
గాజువాకలో ప్రజలు తనను ఓడించిన తర్వాత ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఇంత ఘనమైన స్పందన రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని పవన్ చెప్పారు. అయితే ఓడిపోయిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఎన్నిసార్లు ఆయన గాజువాక ప్రజలకు తన మొహం చూపించారో చెబితే ఇంకా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ కేవలం గాజువాక సభలో మాత్రమే కాదు ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడిన ఒకటే మాట చెబుతూ ఉంటారు. మీరు నాకు అధికారం ఇవ్వండి.. మీ తరఫున సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తాను.. అని మాత్రమే చెబుతుంటారు.
ఇంత నిర్మొహమాటంగా ప్రజలతో డీల్ మాట్లాడే నాయకుడు మరొకరు ఉండరు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత గెలిచినా ఓడినా సరే ప్రజలకు అండగా నిలవడం తన బాధ్యత అని పవన్ కళ్యాణ్ అనుకోవడం లేదు. ఈ తరహాలో రాజకీయ పార్టీ నిర్వహణను ‘బిజినెస్ డీల్’ వ్యవహారం లాగా మార్చేసిన పవన్ కళ్యాణ్ తీరుకు ప్రజలు విస్మయానికి గురవుతున్నారు.