ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో సగానికి పైగా అణగారిన వర్గాల వారికే దక్కాయి. సోషల్ ఇంజనీరింగ్లో తనకు తానే సాటి అని మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరూపించుకున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం గమనార్హం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులను కట్టబెట్టారు. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు దక్కాయి.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీని ఎట్టకేలకు ప్రభుత్వం చేపట్టింది. నామినేటెడ్ పోస్టులను శనివారం ప్రకటించారు. ప్రభుత్వం భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా ఏఏ సమాజిక వర్గాల వారికి ఎన్నెన్ని దక్కాయో తెలుసుకుందాం.
ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కడప జిల్లాలో మొత్తం 11 నామినేటెడ్ పోస్టులు దక్కాయి. వీటిలో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు లభించాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఏడు పోస్టులకు గాను ఒకటి మినహా మిగిలిన అన్ని పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు దక్కడం గమనార్హం.
విజయనగరం జిల్లాలో ఏడు పోస్టులకు గాను రెండు మినహా మిగిలిన ఐదు పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలతో భర్తీ చేశారు. విశాఖలో 10 పోస్టుల్లో ఐదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కాయి.
తూర్పు గోదావరిలో17 పోస్టుల్లో 9, పశ్చిమగోదావరిలో 12 పోస్టుల్లో 6, కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో 6, గుంటూరులో 9 పోస్టుల్లో 6, ప్రకాశంలో 10 పోస్టుల్లో 5, నెల్లూరులో 10 పోస్టుల్లో 5, చిత్తూరులో 12 పోస్టుల్లో 7, అనంతపురంలో 10 పోస్టుల్లో 5, కర్నూలు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 5 చొప్పున పోస్టులు దక్కాయి.
సామాజిక న్యాయం పాటించేందుకు పార్టీ పెద్దలు పెద్ద ఎత్తున గత కొంత కాలంగా కసరత్తు చేశారు. ఎట్టకేలకు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు.