పవన్ Vs లోకేష్: జాబ్ క్యాలెండర్ రాజకీయం

అటు పవన్, ఇటు లోకేష్ ఇద్దరూ జాబ్ క్యాలెండర్ తో రాజకీయాలకు దిగారు. యువతను, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు అండగా ఉండేది నేనంటే నేనంటూ పోటీ పడుతున్నారు. చలో…

అటు పవన్, ఇటు లోకేష్ ఇద్దరూ జాబ్ క్యాలెండర్ తో రాజకీయాలకు దిగారు. యువతను, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు అండగా ఉండేది నేనంటే నేనంటూ పోటీ పడుతున్నారు. చలో తాడేపల్లి ఉద్యమాన్ని నేనే ముందుండి నడిపిస్తానంటున్నారు లోకేష్. అధికారులకు వినతిపత్రాలివ్వడంలో నేను పోటీ పడతానంటున్నారు జనసేనాని. ఇంతకీ వీరిద్దరిలో జాబ్ క్యాలెండర్ రాజకీయం ఎవరికి కలిసొస్తుంది..?

అమరావతి పోరాటం అచ్చిరాలేదు. మద్యం రేట్లు పెంచారనే గోల కూడా కలసి రాలేదు. ఇసుక సమస్య హైలెట్ కాలేదు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రంలో కొదవలేదు. ఈ దశలో ప్రతిపక్షాలకు కొత్త సబ్జెక్ట్ కావాలి. సరిగ్గా ఇదే టైమ్ లో జాబ్ క్యాలెండర్ వచ్చింది. దీంతో అటు పవన్, ఇటు లోకేష్ దీన్ని ఎత్తుకున్నారు.

వాస్తవానికి సచివాలయాల ఉద్యోగాలు, వాలంటీర్లు, ఎండీయూ ఆపరేటర్ల పేరుతో రేషన్ సరకుల పంపిణీ పోస్ట్ లు.. ఇలా లక్షలాది ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల కల నెరవేర్చారు జగన్. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనన్ని పోస్ట్ ల్ని అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే భర్తీ చేశారు. 

రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. కానీ జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ఏపీపీఎస్సీ భర్తీ చేసే పోస్ట్ లు తక్కువగా ఉండటంతో నిరుద్యోగులు అసంతృప్తికి లోనయ్యారు. ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు లోకేష్, పవన్.. ఇలా తంటాలు పడుతున్నారు.

లోకేష్ ఏం చేస్తున్నారు..?

నారా లోకేష్ యధావిధిగా జాబ్ క్యాలెండర్ సమస్యలపై కూడా జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టారు. నిరుద్యోగులందరికీ జూమ్ కాన్ఫరెన్స్ లలో మాట్లాడుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలతో జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయిస్తున్నారు. 

చలో తాడేపల్లి కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. అవసరమైతే తానే ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తానంటూ కోతలు కోస్తున్నారు. మరికొంతమందిని ప్రత్యక్షంగా కలుస్తూ ఫొటోలకు పోజులిస్తున్నారు.

పవన్ చేస్తున్నదేంటి..?

పవన్ కల్యాణ్ పూర్తిగా పేపర్ వర్క్ చేస్తున్నారు. స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఆ మధ్య మంగళగిరి పర్యటనలో నిరుద్యోగులు కొంతమంది తనను కలవడాని వచ్చినపుడు వారికి భరోసా ఇచ్చి పంపించారు. తనకి తానుగా ఈ సమస్యని హైలెట్ చేయాలనుకోలేదు. అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వెళ్లాలనుకుంటున్నారు. 

జిల్లా కేంద్రాల్లో అధికారులకు మెమొరాండం ఇస్తామని మాత్రం గట్టిగా చెబుతున్నారు. వినతి పత్రాలతో పని జరిగేట్టు ఉంటే.. ఈపాటికే అయ్యేది కదా. ప్రత్యేకంగా జనసేన వినతిపత్రాలకు ఏమైనా పవర్ ఉంటుందేమో వారికే తెలియాలి.

నిజంగా వీళ్లు చేయాల్సింది ఏంటి?

నిజంగానే జాబ్ క్యాలెండర్ తో రాజకీయం చేయాలనుకుంటే.. లోకేష్, పవన్ జనంలోకి రావాలి. విద్యార్థి సంఘాలతో కలసి ఉద్యమం చేయాలి. మరీ ముఖ్యంగా జగన్ సర్కారు ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన ఉద్యోగాలు, భవిష్యత్తులో రాబోతున్న ఉద్యోగాలపై చర్చ పెట్టాలి. కానీ అలా చేస్తే అటు టీడీపీ, ఇటు జనసేన బండారం బయటపడుతుంది. తాము చేస్తున్న ఉద్యమం ఫేక్ అనే విషయం బయటపడుతుంది.

జాబ్ క్యాలెండర్ రాజకీయాలతో ఇద్దరూ సాధించేదేమీ లేదు. కొన్నాళ్లకు పవన్ మళ్లీ సినిమాలు చేసుకుంటారు, లోకేష్ ఎప్పట్లానే ట్విట్టర్ లో పడుకుంటారు. ఇద్దరికీ ఈ ఇష్యూపై సీరియస్ నెస్ లేదు.