నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు వెంకటేష్. అయితే నారప్ప సినిమా ఓటీటీలోనే ఎందుకు రిలీజ్ అవుతోందనే ప్రశ్నకు అలా అడక్కూడదంటూ సమాధానం ఇచ్చారు.
“ఓటీటీకే ఎందుకు అని అడక్కూడదు. కొన్ని సార్లు జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించాల్సిందే. లైఫ్ లో ఎందుకు అని అడక్కూడదు. నేనెప్పుడూ నా జీవితంలో ఎందుకు అని ప్రశ్నించుకోలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. ఇప్పుడీ ఓటీటీ రిలీజ్ కూడా అలాంటిదే. కాబట్టి ఓటీటీలోనే రిలీజ్ ఎందుకు అని అడక్కూడదు.”
తన సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు కూడా.. సెంటర్లు, కలెక్షన్ల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ గురించి కూడా పట్టించుకోవట్లేదన్నారు వెంకటేష్. కొన్నిసార్లు టైమ్ బట్టి నడుచుకోవాలని.. రిలీజ్ తన చేతిలో లేదన్నారు. అయితే ఫ్యాన్స్ ఫీల్ అయిన మాట నిజమేనంటూ వాళ్లకు క్షమాపణలు చెప్పారు.
“నా ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట నిజమే. వాళ్లకు నేను క్షమాపణలు చెబుతున్నాను. నారప్పను ఓటీటీలో అదరించండి. మరో సినిమా థియేటర్లలోకి వస్తుంది. నేనేంటనేది నా అభిమానులకు తెలుసు. కాబట్టి నాపై ఫిర్యాదులు చేయరు. చిన్న బాధ అయితే ఉంటుంది నేను అర్థం చేసుకోగలను.”
ఇలా నారప్ప ఓటీటీ రిలీజ్ పై స్పందించారు వెంకటేష్. తమిళ్ లో క్లాసిక్ గా నిలిచిన సినిమాను ఛాలెంజ్ గా తీసుకొని నారప్ప చేశానని, తన నటన ఎలా ఉందో స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత చూసి చెప్పాలని కోరారు. 20న స్ట్రీమింగ్ కు వస్తోంది నారప్ప.