ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో సంచలనం చోటు చేసుకుంది. వైసీపీ మహిళా ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టులను ఇవాళ భర్తీ చేశారు.
పదవులు వచ్చిన వాళ్లు ఖుషీగా ఉన్నారు. పదవులు ఆశించి రానివాళ్లకు మాత్రం నిరాశే మిగిలింది. సినీ, పొలిటికల్ సెలబ్రిటీ అయిన ఆర్కే రోజా తన ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవి పోగొట్టుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజా స్థానంలో మెట్టు గోవిందరెడ్డిని ప్రభుత్వం నియమించింది.
జగన్ కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించిన రోజాకు అప్పట్లో భంగపాటు ఎదురైంది. దీంతో ఆమె అలక వహించారు. రోజాను బుజ్జగించేందుకు సీఎం వైఎస్ జగన్ ఆమెను తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చి ఆమెను అలక మాన్పించారు.
ఆ పదవిలో ఆమె ఎంత కాలం ఉన్నదో తెలియదు కానీ, త్వరగా తీసేసిన భావన ఏర్పడుతోంది. అయితే ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఉండకూడదనే పాలసీ మేరకే రోజాను కీలక పదవి నుంచి తప్పించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను తొలగించి, ఆయన స్థానంలో అడపా శేషును నియమించడాన్ని గుర్తు చేస్తున్నారు. రోజా తొలగింపుపై మరో వాదన తెరపైకి వస్తోంది.
త్వరలో ఏపీలో చేపట్టే కేబినెట్ పునర్వ్యస్థీకరణలో రోజాకు చోటు దక్కుతుందని చెబుతున్నారు. రానున్న మంత్రి పదవి సంగతేమో గానీ, ఉన్న ఏపీఐఐసీ చైర్మన్ పదవి మాత్రం ఊడిందనే ఆమె అభిమానులు వాపోతున్నారు.