చెత్తని వదిలించుకోవయ్యా చంద్రన్నా!

పచ్చభక్తులు ఇప్పుడు పాడుకోవాల్సింది “జయము జయము చంద్రన్నా” పాట కాదు.  “చెత్తని వదిలించుకోవయ్యా చంద్రన్నా!” అంటూ కొత్త పల్లవి ఎత్తుకుని పాట పాడి తమ నాయకుడి కళ్లు తెరిపించుకోవాలి.  Advertisement తాజాగా ఒంగోల్లో జరిగిన…

పచ్చభక్తులు ఇప్పుడు పాడుకోవాల్సింది “జయము జయము చంద్రన్నా” పాట కాదు.  “చెత్తని వదిలించుకోవయ్యా చంద్రన్నా!” అంటూ కొత్త పల్లవి ఎత్తుకుని పాట పాడి తమ నాయకుడి కళ్లు తెరిపించుకోవాలి. 

తాజాగా ఒంగోల్లో జరిగిన “మహానాడు” చూసాక సగటు ఓటరు పరిస్థితితేంటో బేరీజు వేసుకోవచ్చు. 

ఏ పార్టీకైనా ఓటర్లు ప్రధానంగా రెండు రకాలు:

1. కులం వల్లో, అభిమానం వల్లో గుడ్డిగా ఒక పార్టీని నమ్ముకుని ఓట్లేసే రకం

2. రాగద్వేషాలకి అతీతంగా ఉన్న వాళ్లల్లో తమకి ఎవరు బెటరో సొంతంగా ఆలోచించి ఓటు వేసే రకం 

వీళ్లల్లో మొదటి రకం ఎప్పుడూ అంటి పెట్టుకునే ఉంటారు. వీళ్లతో సమస్య లేదు. జయాపజయాల్ని తేల్చేదల్లా రెండో రకమే. వీళ్లే అధికశాతం ఓటర్లు.

వీళ్లల్లో మళ్లీ మూడు రకాలు

1. పేద- మధ్య తరగతి 

2. ఎగువ మధ్య తరగతి

3. ధనికులు 

వీరిలో పేదలే అధికులు. ఒక లెక్క ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశులో ఏదో ఒక స్కీము అందుకుంటున్నవారు ఓటర్లలో ఏకంగా 86% ఉన్నారు. అంటే స్కీములందుకోని 2, 3 వర్గాల వాళ్లు 14% మాత్రమే అన్నమాట. 

ఇంత స్థాయిలో ఏదో ఒక స్కీముతో మొత్తం 86% ఓటర్లని కవర్ చేయడమనే ఫీల్డింగ్ గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. అందుకే ఏదో ఒక వర్గం అసంతృప్తితో ఉండి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దోహదపడేవారు. 2019 నుంచి స్థానిక ఎన్నికల్లో కూడా పేదల్లో ప్రభుత్వసానుకూలత పెరగడానికి కారణమేంటో వేరే చెప్పక్కర్లేదు. 

ఇప్పుడు పరిస్థితి అలా లేదు. గత ప్రభుత్వం సమయంలో అందుకోని పథకమేదో ఒకటి ఈ ప్రభుత్వంలో అందుకుంటున్నంతకాలం వాళ్లు పక్క చూపులు చూడరు. 

పైగా బాగా తెలివి మీరి ప్రతిపక్ష మీడియా మైకు పెట్టినప్పుడు ఆ చానల్ ముఖస్తుతి కోసం ప్రభుత్వవ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చినా ఎన్నికల్లో ఓటు మాత్రం లబ్ధిని అందించిన ప్రభుత్వాన్ని నడిపే పార్టీకే వేస్తారు. 2019 ఎన్నికలప్పుడు మీడియాకి ఎదురైన అనుభవం ఇది. 

వీళ్ళని తమ వైపుకు తిప్పుకోవాలంటే ప్రతిపక్షాలు మరింత మెరుగైన సంక్షేమం అందిస్తామని నమ్మించగలగాలి. అదొక్కటే దారి తప్ప మరొకటి లేదు. 

ఇక 2,3 వర్గాలకి చెందిన ఎగువ మధ్యతరగతి, ధనిక ఓటర్ల విషయానికొద్దాం.  వీళ్లకి స్కీములు అందవు కాబట్టి అభివృద్ధి మీద, రాష్ట్రం అప్పుల మీద, నేతల మాటతీరు మీద ఫోకస్ పెడతారు. 

తాజా “మహానాడు”లో కనీసం ఈ వర్గాన్నైనా తమ వైపుకు తిప్పుకునే విషయంలో సక్సెస్ అవుతారేమో పచ్చపార్టీ నాయకులు అనుకున్నారు చాలామంది. 

కానీ ఊహించినట్టుగానే “ప్రభు స్తుతి- పరనింద” తప్ప ఇంకేం సౌండివ్వలేదు. 

ఇన్నాళ్లూ వైకాపా నాయకుల్లో కొడాలి నానిని, అంబటి రాంబాబుని చూపించి బూతు మంత్రులన్నారు పచ్చ మీడియా వాళ్లు, నాయకులు. 

అలా మాట్లాడినప్పుడు తమ పార్టీ నాయకులు ఎలా ఉన్నారో కూడా చూసుకోవాలి కదా. 

“తెలుగువారి ఆత్మగౌరవం”, “తెలుగింటి ఆడపడచు” వంటి నినాదాలతో ఎన్.టి.ఆర్ అప్పట్లో తెదేపాని నడిపితే ఇప్పుడా ఆత్మగౌరవం బూతులు పలకడానికి, ఆడపడుచు తొడ గొట్టడానికి దిగజారిపోయాయి. 

నిజంగానే “మహానాడు” అనగానే జనానికి గుర్తున్నది:

–  “నా కొడకల్లారా…” అంటూ పర్ఫామెన్స్ ఇచ్చి పబ్లిక్ గా కాలెత్తి తొడగొట్టిన గ్రీష్మ అనబడే ఒకావిడ

– మంత్రి రోజాని రింగుల రాణి అంటూ ఈవ్ టీజర్ లా మాట్లాడే అయ్యనపాత్రుడు

– మంచినీళ్ల పంపు దగ్గర గలాటాలాంటి అరుపులతో దివ్యవాణి

– ఉత్తరకుమార ప్రగల్భాల లోకేష్ నాయుడు 

– నోటిదూల పట్టాభి

– ఫ్యాక్షన్ పరిటాల

–  మైనింగ్ డాన్ ఎరప్తినేని…

..అంతే.  

తెదేపా వాళ్లు వైసీపీలో ఇద్దర్ని వేలెత్తి చూపిస్తే తెదేపావాళ్లు తమకి తాముగా ఇలా అనేకమందిని చూపించుకున్నారు. 

“ఈ పచ్చ చెత్తమూకకంటే ఆ వైసీపీ వాళ్లే నయం” అన్నట్టుగా ప్రదర్శన ఇచ్చారు తప్ప ఎక్కడా హుందాతనం చూపించలేదు, తమని ఎన్నుకుంటే ఎవర్ని ఉద్ధరిస్తారో చెప్పలేదు. 

అందుకే..చంద్రబాబు ముందుగా ఈ చెత్తని వదిలించుకోవాలి. డీసెన్సీకి మారు పేరుగా చెప్పుకునే తన పార్టీ నాయకుల్ని డీసెంట్ గానే ప్రవర్తించమని చెప్పాలి. అప్పుడే జనంలో సానుభూతొస్తుంది.

అవును..ఇప్పుడు తెదేపా ప్లే చెయ్యాల్సిని సానుభూతి సినిమా. అంతే తప్ప తొడలు గొట్టే బాలకృష్ణ సినిమా కాదు. 

అక్కడికీ ఆ మధ్యన చంద్రబాబు ఒక ప్రెస్మీట్లో ఏడ్చి జాతీయ వార్తగా మార్చాడు. అది కంటిన్యూ చేసినా బాగుండేదేమో. ఇలా తొడలు కొట్టి షమ్షేర్ అంటుంటే చిరాకు, నవ్వు వస్తాయి తప్ప పౌరుషాలు ఏ న్యూట్రల్ ఓటరుకీ రావు. 

అస్సలు తలకాయ వాడకుండా కేవలం నాలుకలే వాడిన సభ “మహానాడు”. 

సగటు ఓటర్ని తమ వైపుకు తిప్పుకునే ఒక్క స్పీచుకూడా లేకపోయింది. 

ఇటు వైసీపీ అయినా, అటు తెదేపా అయినా స్పీకర్లు తమ తమ నాయకులకి డప్పు కొట్టడం సహజం. కానీ గెలుపులో ఉన్నవాడు డప్పుకొట్టుకుంటే భరించొచ్చు కానీ, ఓడిపోయి మూలుగుతున్న వాడిని పొగుడుతున్నప్పుడే సగటు ఓటరుకి చిరాకేస్తుంది. 

పైన చెప్పుకున్నట్టుగా కులం ఓట్లు, గుడ్డి అభిమానం ఓట్లు, సొంత పార్టీ కుటుంబాల ఓట్లు తప్ప అశేష జనవాహిని నుంచి ఒక్క కొత్త ఓటు కూడా పొందలేని విధంగా “మహానాడు” జరిగింది. 

అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ “మహానాడు” అట్టర్ ఫ్లాపైన హై బజెట్ సినిమా. ఖర్చు కనిపిస్తుంది తప్ప ఫలితం శూన్యం. 

హరగోపాల్ సూరపనేని