ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ ఇంజనీరింగ్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అభివృద్ధి కంటే కులాల సమీకరణకే రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తోంది. దీన్నిబట్టి కులాలు రాజకీయాల్లో ఎంతగా పాతుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు.
సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర చివరి రోజు అనంతపురానికి చేరింది. జగన్ కేబినెట్‌లో 70 శాతం పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చోటు కల్పించారు. 25 మంది మంత్రుల్లో 17 మంది వారే కావడం విశేషం.
ఈ 17 మంది మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టి, తమ ప్రభుత్వం అణగారిన వర్గాల ఇస్తున్న ప్రాధాన్యం గురించి వివరిస్తున్నారు. ముగింపు సభకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు నమ్మే స్థితిలో జనాలు లేరన్నారు. చంద్రబాబును జనం ఎప్పుడో ఇంటికి పంపారన్నారు. బీసీ మంత్రుల్ని డమ్మీగా చేసిన చరిత్ర చంద్రబాబుదే అని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.
2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో మ్యానిఫెస్టో తొలగించిన చరిత్ర టీడీపీదేనని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రి కొనియాడారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో సామాజిక విప్లవం వచ్చిందన్నారు.
అన్ని కులాలకు పదవులు దక్కడం దేశంలో ఎక్కడా లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే అన్నికులాలకు పదవులు దక్కడం సాధ్యమైందన్నారు. బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. చంద్రబాబు నీచరాజకీయాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు.