జనసేన పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి పునరాలోచిస్తాడని, మళ్లీ సినిమా రంగంలోకే వెళ్లిపోతాడని మీడియాలో ఊహాగానాలు సాగాయి. కాని అవి నిజం అయ్యేలా కనబడటంలేదు. రాజకీయ సినిమాలోనే ప్రధాన పాత్ర పోషించాలని, అందులోనే హిట్ కొట్టాలని పవన్ నిర్ణయించుకున్నట్లు ఆయన తీరునుబట్టి అర్థమవుతోంది. పవన్ ఇక సినిమాల్లో నటించడని, ఎవరైనా నిర్మాతలు, దర్శకులు మరీ బవవంతం చేస్తే అతిథి పాత్రల్లో నటిస్తాడని సోదరుడు నాగబాబు ఈమధ్యనే చెప్పాడు. సినిమాల్లో పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ తన పవర్ రాజకీయాల్లోనే చూపించాలనుకుంటున్నారు. ఇదే ఆయన అంతిమ నిర్ణయమైతే అభినందించాల్సిందే. తాను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదని, కనీసం పాతికేళ్లపాటు కొనసాగడానికే వచ్చానని అనేకసార్లు చెప్పాడు. ఇలా చెప్పిన తరువాత ప్లేటు ఫిరాయిస్తే పరువుపోతుంది.
ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లు సాధించి కూడా చిరంజీవి ప్రజారాజ్యం నడపలేక కాంగ్రెసులో విలీనం చేసి అందుకు నష్టపరిహారంగా కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. కాంగ్రెసు అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకీ దూరమయ్యాడు. రాజ్యసభ సభ్యత్వం ముగిశాక ఇప్పటివరకు రాజకీయాల ఊసు ఎత్తలేదు. ఆ పరిస్థితి తనకు రాకూడదని పవన్ అనుకుని ఉండొచ్చు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పోరాట యోధుడిగా మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా జనంలోనే ఉన్నాడని, పట్టువదలకుండా పోరాటం చేశాడని, దాని ఫలితంగానే ఈనాడు ముఖ్యమంత్రి పీఠం దక్కిందని మీడియాలో కథనాలు వచ్చాయి. వాస్తవం కూడా ఇదే కదా. ఇది పవన్‌పై ప్రభావం చూపించి ఉండొచ్చు.
కారణాలు ఏమైనప్పటికీ రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్న పవన్ ఏపీలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై దృష్టిపెట్టాడు. మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం తన లక్ష్యం కాదని, జనసేన వాటిల్లోకి ప్రవేశిస్తే అదే తొలి విజయమని అన్నాడు. పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి పెట్టిన ఈయన కొన్ని కమిటీలను నియమిస్తున్నాడు. జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాటం చేస్తామని చెప్పాడు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలనాటికి పార్టీని బలోపేతం చేస్తానంటున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో అంతోఇంతో సత్తాచాటితే అది పవన్‌లో ఆత్మవిశ్వాసం పెంచే అవకాశముంది. సినిమా దర్శక నిర్మాతలు పవన్‌తో సినిమాలు తీయాలని ఉబలాటపడుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
జనసేన ఎన్నికల్లో బోల్తాపడితే పవన్ మళ్లీ సినిమా రంగంలోకి వస్తాడని ఆయనతో సినిమాలు తీయాలని ఉబలాటపడిన దర్శకనిర్మాతలు ఊహించారు. పవన్ కోసం కథలు సిద్ధం చేశారు. ఈ వార్తలను పవన్ అవునని కాదని చెప్పలేదు. జనసేన ప్రతిపక్షం కాబట్టి పార్టీని నడిపే ఇంధనమైన డబ్బు కావాలి. అందుకోసం సినిమాల్లో నటించేందుకు పవన్ సుముఖంగా ఉంటారని అనుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినా హీరో ఇమేజ్ తగ్గలేదు. ఇప్పటికీ ప్రజాదరణ విపరీతంగా ఉంది. దానికితోడు వయసు, గ్లామర్ ఉన్నాయి. అరవైఏళ్లు దాటిన చిరంజీవి నటిస్తున్నప్పుడు పవన్ ఎందుకు నటించకూడదు? అని కొందరు ప్రశ్నించారు. కాకపోతే రెండు పడవల్లో ప్రయాణం చేస్తే ఇతర పార్టీల విమర్శలు ఎదుర్కోక తప్పదు. రాజకీయాలను , సినిమాలను సమన్వయం చేసుకోగలగాలి. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి అవసరమైతే ఉద్యమాలు, పోరాటాలు చేయాలి. ప్రజలను సమీకరించాలి. ఈ రెండు పడవలను సమానంగా నడపడం కష్టం.
పవన్ రాజకీయాల్లో నిలకడగా లేడని, అతను పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అని ఒకప్పుడు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లోనూ కొనసాగితే అదే విమర్శ ఎదుర్కోవల్సివస్తుంది. ఇది కూడా పవన్ దృష్టిలో ఉండొచ్చు. అధికారంలోకి రాకముందు జగన్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది కాబట్టే ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించగలగారు. ప్రస్తుతం టీడీపీ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇంకెన్ని సంక్షోభాలు వస్తాయో తెలియదు. ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలనుకుంటోంది.
ఈ నేపథ్యంలో పవన్ పార్టీ బలంగా ఎదగకపోతే భవిష్యత్తు ఉండదు. పార్టీని బలోపేతం చేయాలంటే సినిమాల గురించి ఆలోచించకుండా రాజకీయాల్లోనే చెమటోడ్చాలి. అప్పుడు పార్టీ నాయకులకు, ప్రజలకు ఆయనపై నమ్మకం ఏర్పడుతుంది. రెండు పడవల్లో కాళ్లు పెడితే రాజకీయ తెరమీద జనసేన ఉండకపోవచ్చు. ఈ విషయంలో పవన్‌కు స్పష్టత వచ్చి ఉండొచ్చు.