యాత్ర ఓకే గానీ.. ప్రగల్భాలు కోటలు దాటుతున్నాయ్!

తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉన్నదో ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలుగుదేశం ఇక్కడ శవాసనం వేసి దాదాపు దశాబ్దం కావస్తోంది. ఇప్పుడిక ఆ పార్టీని లేపి నిలబెట్టేందుకు చేసే ప్రయత్నాలు ఏ మాత్రం…

తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉన్నదో ప్రతి ఒక్కరికీ తెలుసు. తెలుగుదేశం ఇక్కడ శవాసనం వేసి దాదాపు దశాబ్దం కావస్తోంది. ఇప్పుడిక ఆ పార్టీని లేపి నిలబెట్టేందుకు చేసే ప్రయత్నాలు ఏ మాత్రం ఫలితం ఇస్తాయి? ఇది పార్టీ వర్గాలు సహా ఎవ్వరికీ అందుచిక్కని ప్రశ్నే. అయితే.. ఆ ప్రయత్నం మాత్రం ఆగడం లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున బస్సు యాత్రకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సిద్ధం అవుతున్నారు. 

రెండు కళ్ల సిద్ధాంతం వంటి మాయమాటలతో వంచించే ప్రయత్నం చేసినందుకు తెలంగాణ ప్రజలు తెలుగుదేశాన్ని, చంద్రబాబునాయుడును గట్టిగానే తిప్పికొట్టారు. చంద్రబాబునాయుడుకు హైదరాబాదులో ఒక సొంత ఇల్లు, పార్టీ ఆఫీసు తప్ప ఇంకేం మిగల్లేదు. పార్టీ పరిస్థితి నామమాత్రావశిష్టంగా తయారైంది. చట్టసభల్లో పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 

తెదేపా తరఫున గెలిచిన వారందరూ కూడా.. గులాబీదళంలో చేరిపోయారు. పార్టీ ఖాళీ అయింది. పార్టీ రాష్ట్ర సారథిగా ఉన్న బీసీ నేత ఎల్ రమణ కూడా పార్టీని వీడిపోయారు. ఆతర్వాత ఆపద్ధర్మంగా కొంత కాలం పార్టీని నడిపి, చివరకు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న నేతగా గుర్తించిన కాసాని జ్ఞానేశ్వర్ చేతిలో పార్టీని పెట్టారు చంద్రబాబునాయుడు.

కాసాని సారథ్యంలో పార్టీ కాస్త ఉత్సాహంగా అడుగులు వేస్తున్నది. సుదీర్ఘకాలం గ్యాప్ తర్వాత ఖమ్మంలో చంద్రబాబు ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు. దాని తర్వాత ఒక నెల వ్యవధిలోనే తెలంగాణ లో మరో రెండు సభలు కూడా నిర్వహిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు గానీ.. అవి జరగలేదు. రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర అని అన్నారు. ప్రస్తుతానికి జీహెచ్ ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా బస్సు యాత్ర నిర్వహించబోతున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది. 

ఈ నెల 23 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తెలుగుదేశం బస్సుయాత్ర నిర్వహిస్తారట. చంద్రబాబు ప్రారంభిస్తారట. నగరం తర్వాత జిల్లాలకు కూడా యాత్రను విస్తరిస్తారట. ఇదంతా బాగానే ఉన్నది గానీ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 199 నియోజకవర్గాల్లో పోటీచేయడానికి తమ పార్టీ కార్యకర్తలు రెడీగా ఉన్నారని కాసాని జ్ఞానేశ్వర్ అంటున్నారు. ఈ మాటే పెద్ద కామెడీగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ పదేళ్లలో పార్టీకి తగిలిన ఎదురుదెబ్బలకు వందకు పైగా నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి జెండా పట్టుకునే దిక్కు కూడా లేకుండాపోయింది. జ్ఞానేశ్వర్ మాత్రం తమ అభ్యర్థులు సిద్ధం అంటున్నారు. 

అంత సిద్ధంగా ఉంటే ఇప్పుడే అభ్యర్థుల జాబితా ప్రకటించేయవచ్చు కదా.. ఇప్పటినుంచి కష్టపడి పనిచేసుకుంటారు కదా.. అనేది జనం సందేహం. అందుకే కాసాని ప్రగల్భాలను గమనించిన ప్రజలు నవ్వుకుంటున్నారు.